ప్రజాశక్తి కదిరి టౌన్ : కదిరి డివిజన్‌లోని ప్రవేట్ పాఠశాలల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆర్‌ఎస్‌వైఎఫ్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ నాయకులు ఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. రాయలసీమ విద్యార్థి యువజన ఫెడరేషన్ అనే సంఘం పేరుతో కొందరు స్వార్థపరులు కదిరి డివిజన్ లో వున్న ప్రవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చందాలు ఇవ్వాలని లేకుంటే మీ స్కూల్‌లో వసతులు సరిగా లేవని పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా తమను కులం పేరుతో దూషించారని కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. చిన్న చిన్న విద్యాసంస్థలు స్థాపించి తమతో పాటు కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ విద్యాభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తున్న తమపై బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంసజమని అన్నారు. వీరి ఆగడాలు ఇలాగే కొనసాగితే తాము స్కూళ్లను మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, సిఆర్‌ఒ రవిచంద్రారెడ్డి , అనంతపురం నగర గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మల్లేష్, కదిరి డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, శేషానందరెడ్డి, సాదిక్ బాషా, శంకర్ రెడ్డితో పాటు ఆయా ప్రయివేటు పాఠశాలల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.










