రాయచోటి : కార్పొ'రేట్' పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నాయి. ప్రయివేట్ పాఠశాలల్లో విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి జిఒలు ప్రకారం పీజులు వసూలు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతర్ చేస్తున్నాయి. జిల్లాలో ప్రయివేటు స్కూళ్ల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నది. ఫీజుల దోపీడికి తోటు పుస్తకాలు, యూనిఫారాలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుండడం వారి కాసుల దాహార్తికి నిదర్శనం. కార్పొరేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 547 ప్రయివేటు పాఠశాలలో 93,903 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో నోటీసు బోర్డు వివరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల సూచించి నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏ పాఠశాలలో కూడా అమలు చేయకపోవడం శోచనీయం. యూని ఫామ్, పుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, బెల్టు, ఐడి కార్డు, ఇతర వస్తవులకు అధిక మొత్తంలో పీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యా శాఖ అధికారులు మౌనం వహి స్తున్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై ఆరు రోజులు గడిచినప్పటికీ పుస్తకాలు, యూనిఫాం పేరిట రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఒకటి నుండి 10వ తరగతి వరకు వేల రూపాయలు యాజమాన్యాలు వసూలు చేస్తున్నా విద్యా శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎల్‌కెజి, యుకెజి పేరిట భారీ మొత్తంలో ప్రయివేట్ పాఠశాలలు వసూలు చేస్తున్నాయి. కేవలం పుస్తకాలు, యూని ఫాంకే రూ.10 వేలు వసూలు చేస్తే, ఫీజులు మాత్రం ఏ స్థాయిలో వసూలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. రాయచోటిని జిల్లా చేసి ఏడాది పూర్తి కావడంతో ఇది అదునుగా భావించిన యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎక్కువ మంది తల్లితండ్రులు ప్రయివేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. విద్యా బోధనలు, క్రమశిక్షణ, మెరుగైన సేవలం దించడంలో ఏ ప్రయివేట్ పాఠశాలలో సరైన పద్ధతి అవలంభిస్తారని భావించి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలల వైపే వెళ్ళడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో సరైన వసతులు లేక పోవడం వలన తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలల వైపే వెళుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యమే ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలు పాటించడం లేదు. ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే జిల్లాలో కొన్ని పాఠశాలలకు అనుమతులు కూడా లేవు. వాటిపైన విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. కొంత మంది ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు అనుమతి తెచ్చుకొని 7వ తరగతి వరకు కూడా విద్యా బోధనలు అందించే పరిస్థితి కనపడుతుంది. మరి కొన్ని పాఠశాలలు సరైన ఆట స్థలం, పాఠశాల అను మతులు లేనట్లు తెలుస్తుంది. దీనిపైన విద్యా శాఖ అధికారులు ప్రత్యేక దష్టి పెడితే తప్ప జిల్లాలో ఉండే ప్రయివేట్ పాఠశాలలు, ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన పాఠశాలలపై చర్యలు తీసుకో వాలని పలువురు కోరుతున్నారు.
ఫీజులను నియంత్రించాలి..
ప్రయివేటు పాఠశాలలో పిల్లలను చదివించాలంటే భయమేస్తుంది. జూన్ నెలలో పాఠశాలలో ప్రారంభమవుతాయి, పిల్లలకు పాఠశాలలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, బస్సు ఫీజు ఇతర వస్తువులపైన అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రయివేట్ పాఠశాల ఫీజులను నియంత్రించేందుకు చర్య తీసుకోవాలి.
- రాజశేఖర్, విద్యార్థి తండ్రి, రాయచోటి.
చర్యలు తీసుకోవాలి
కార్పొరేట్, ప్రయివేటు విద్యా సంస్థల ఫీజు నియంత్రణ కమిటీ వేసి ఆర్భాటం చేయటం తప్ప ఆచరణలో శూన్యమం. వెంటనే ఫీజులు నియంత్రణ చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల కోసం వేధిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం పాఠ్యపుస్తకాలు వేల రూపాయలు పెట్టి తల్లిదండ్రులు కొంటున్నారు. ఐకాన్, ఒలంపియాడ్, టెక్నో, ఐఐటి, జెఇఇ వంటి పేర్లు పెట్టి ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ కంటే కొత్త సిలబస్‌ను క్రియేట్ చేసుకుని వీటి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు తెలిసిన కూడా పట్టించుకో వడంలేదు.ప్రభుత్వం స్పందించి కార్పొరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.
- సర్వేపల్లి నరసింహ, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, అన్నమయ్య.
కఠిన చర్యలు తీసుకుంటాం
తమకు ఇంత వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. తల్లిదండ్రులు ఎవరైనా ప్రయివేట్ పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాల పైన అధిక రేట్లు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- శ్రీరామ్ పురుషోత్తం, డిఇఒ, అన్నమయ్య.










