ప్రజాశక్తి-కంభంవారిపల్లె : మండలంలోని గర్నిమిట్టలో ప్రయివేట్ ఆస్పత్రులను సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్యామల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రుల నిర్వాహకులతో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్లినిక్ నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. బోర్డులో 'ప్రథమ చికిత్స కేంద్రం' అని మాత్రమే నమోదు చేయాలన్నారు. ప్రాక్టీస్ చేసే వారి పేరు ఎదురుగా డాక్టర్ అనే పదం వాడరాదని సూచించారు. క్లినిక్‌లో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, వ్యాధులు రాకుండా సలహాలు సూచనలు అందజేసి మిగతా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని సూచించారు. క్లినిక్‌ల్లో బెడ్స్ ఏర్పాటు చేయడం, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం, స్టెరాయిడ్లు, మత్తుమందులు, యాంటీబయోటిక్స్ ఇంజక్షన్ వేయడం చేయరాదన్నారు. అనధికారికంగా మందులు అమ్మడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం కాని, వాటిని సూచించడం కాని చేయరాదన్నరు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ రేష్మ, ఆరోగ్య విస్తరణ అధికారులు కృష్ణమ్మ, కృష్ణయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు పురుషోత్తం, చెన్నమ్మ, ఆశారెడ్డి లక్ష్మి పాల్గొన్నారు.










