పేరు : జూహీచావ్లా
పుట్టినతేదీ : 13 నవంబర్ 1967
పుట్టిన ప్రాంతం : అంబాల, హర్యానా
నివాస ప్రాంతం : ముంబై
చదువు : హెచ్‌ఆర్ స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్
భర్త : జరు మెహత
పిల్లలు : అర్జున్ మెహతా,
జాహ్నవి మెహతా
తల్లిదండ్రులు : డాక్టర్ ఎస్ చావ్లా,
మోనాచావ్లా
సోదరులు : సంజీవ్ చావ్లా,
సోనియా చావ్లా
హాబీస్ : రీడింగ్, యోగ
దేశంలో 5జి వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల అమలుకు వ్యతిరేకంగా అలనాటి అందాల బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ కారణంగా దేశంలో రేడియేషన్ తీవ్రంగా ఉంటుందనీ.. ఇది జీవవైవిద్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. మనుషులు, జంతువులు, వక్ష, జంతుజాలంపై ఈ రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు వచ్చిన టెక్నాలజీల కన్నా 5జి టెక్నాలజీ వల్ల మరింత రేడియేషన్ పెరుగుతుంది. ఇది పిల్లలు, మహిళలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది తమ అధ్యయనాల్లో తేలిందని వివరించారు. దీనిపై పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు, వారి అభ్యంతరాలతో కూడిన పత్రాలతో ఆమె పిటిషన్ వేశారు.
అయితే ప్రభుత్వాలు పర్యావరణానికి హాని కలిగే నిర్ణయాలు తీసుకున్న సమయంలో వాటికి వ్యతిరేకంగా స్పందనలు రావడం సర్వసాధారణమే. వీరిలో ఎక్కువ మంది పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ముందుంటారు. ఇలాంటి విషయాలపై తారలు స్పందించడం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం 5జి నెట్‌వర్క్ సేవలపై ప్రముఖ బాలీవుడ్ నటి జూహీచావ్లా స్పందించారు. అయితే ఆమెకు ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తాజాగా 5జి టెక్నాలజీని రాకుండా ఆపాలని పిటిషన్ వేశారు.
5జి టెక్నాలజీ వల్ల ఇటు మనుషులకూ, అటు మూగజీవాలకూ సురక్షితమని సర్టిఫై చేస్తూ.. తమ వాదనను బలపరచే అధ్యయనాలనూ జత చేయాలని.. ఆ మేరకు ప్రతివాదులను ఆదేశించాలని జూహీచావ్లా పిటీషన్‌లో కోరారు. ఇంతవరకూ ప్రతివాదులు ఎలాంటి అధ్యయనాలు చేయనట్లయితే, ఎలాంటి ప్రైవేటు ప్రయోజనాలను ఆశించకుండా సమర్ధవంతమైన పరిశోధన చేపట్టాలనీ పిటిషన్‌లో జూహీచావ్లా కోరారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో 5జి నెట్‌వర్క్ సేవలు అందుతున్నాయి. అయితే కొన్నిచోట్ల 5జి ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దేశంలోనూ త్వరలోనే 5జి సేవలను అందించనున్నారు. అందుకు గాను ఇటీవలే స్పెక్ట్రం వేలం కూడా నిర్వహించారు. దీంతో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5జి సేవలను అందించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. అందులో భాగంగానే 5జి సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన హార్డ్‌వేర్‌ను, టవర్లను సమకూర్చు కుంటున్నారు. ఈ క్రమంలో 5జి టెక్నాలజీ వల్ల పర్యావరణానికే కాక మనుషులకూ తీవ్రమైన హాని కలుగుతుంది. కనుక 5జి రాకుండా ఆపాలని కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ప్రజల పక్షాన నిలిచారు. కాగా జూహీచావ్లా వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును మరో బెంచ్‌కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 2న జరిగిన విచారణలో కోర్టు ఆమె ఫిర్యాదును కొట్టివేసింది. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించే ముందు ప్రభుత్వానికి ఒక లేఖ రాసి ఉండాలని హరిశంకర్ అభిప్రాయపడ్డారు. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు రూ.20 లక్షలు జరిమానా విధించారు. న్యాయస్థానంలో ఓడిపోయినా ఓ వైపు వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రంపై కేంద్రం చేస్తున్న దాడికి ఎదురునిలిచి జూహీచావ్లా చేసిన ప్రయత్నాన్ని అభిమానులు, పర్యావరణ వేత్తలు అభినందిస్తున్నారు.