Apr 25,2023 21:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : హార్సిలీహిల్స్‌ని పర్యాటక రంగ హబ్‌గా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, వెలిగల్లు జలాశయం దగ్గర ఏర్పాటు చేయనున్న సౌకర్యాలపై డిపిఆర్‌ని సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని విసి హాల్లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా టూరిజం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాన్ని అభివద్ధి చేయడానికి చాలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో టెంపుల్‌ పర్యాటకం, ట్రెక్కింగ్‌ పర్యాటకం, యువ-పర్యాటకం, సాంస్కతిక పర్యాటకం వంటి అనేక రకాల పర్యాటకాలను అభివద్ధి చేసేందుకు అవకాశముందన్నారు. జిల్లాలో ట్రెక్కింగ్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని, అటువంటి పర్యాటకానికి అవకాశమున్న హార్సిలీహిల్స్‌, వెలిగల్లు జలాశయాలను అభివద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. వెలిగల్లు జలాశయం దగ్గర కాటేజేస్‌, హోటల్స్‌ వంటి వాటిని నిర్మించి అభివద్ధి చేసేందుకు డిపిఆర్‌ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమశిల ప్రాజెక్ట్‌ దగ్గర కూడా పర్యాటక రంగానికి మంచి అవకాశముందని, పిపిపి మోడ్‌ ద్వారా అభివద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో యువ-పర్యాటకాన్ని పెంపొందించేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను క్లబ్‌లుగా ఏర్పాటు చేసి వారిని పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. తదనంతరం జిల్లాలో చేపట్టబోయే పర్యాటక రిజిస్ట్రేషన్లు, మామిడి ఫెస్టివల్‌ వంటి పలు అంశాల మీద చర్చించారు. సమావేశానికి జిల్లా అటవీ అధికారి వివేక్‌, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, జిల్లా పర్యాటక అధికారి నాగభూషణ్‌, వివిధ కౌన్సిల్‌ సభ్యులు హాజరయ్యారు.