ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆర్టీసీ జోనల్ ఛైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం పుట్టపర్తి బస్టాండులో పుట్టపర్తి నుంచి కదిరికి రెండు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు మరో 42 ప్రైవేట్ బాడుగ బస్సులకు గాను ఇప్పటికే 18 వచ్చాయని, మిగతా బస్సులు త్వరలోనే వస్తాయని అన్నారు. కాల పరిమితి దాటిన బస్సులను వినియోగించమన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమయపాలన పాటించి ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి మధుసూదన్, డిఎమ్ ఇనయతుల్లా, ఎస్‌టిఐ పెద్దన్న, యూనియన్ నాయకులు షబ్బీర్, ముత్యాలు, పార్థసారధి రెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.










