Aug 05,2022 22:44

గంపలగూడెం : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పై నుండి వచ్చిన వరదతో గంపలగూడెం కట్టలేరు పొంగిపొర్లుతోంది. దీనితో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గంపలగూడెం ఎంపీడీవో వై పి రెడ్డి అటు వెనగడప వైపు ఇటు గంపలగూడెం వైపు బందోబస్తు నియమించారు. ఈ వరదలతో ఇటీవల వేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది.
వత్సవాయి : మండలంలో గత రెండు రోజుల నుండి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయి. వాగులు, కాలువలు, జలమ యమయ్యాయి. పత్తి మిర్చి, వరి పొలాల్లో నీళ్ళు నిలబడి పోయాయి. రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి పొలాల్లో వర్షం నీరు నిలబడిపోవటంతో మొక్కలకు తేమశాతం ఎక్కువై వేరు కుళ్లుడు వచ్చి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రారంభదశలోనే వెంటవెంటనే వర్షాలు పడటంతో మొక్కల చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. సుమారు 20 వేల ఎకరాలకు పైగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు.
నందిగామలో నీట మునిగిన పోలాలు
నందిగామ : నందిగామలో భారీ వర్షం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నందిగామ మండలంలో పలు గ్రామాల్లో పంటలు వరద ముంపు గురైనవి ముఖ్యంగా కంచల, గ్రామంలో మున్నేరు పరిసర ప్రాంతాలు బాగానే పొలాలు నీటి ముంపుకు గురైయ్యాయి. రాఘవపురం, కమ్మవారిపాలెం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్తి, మిర్చి పంట పొలాలకు వరద నీరు చేరింది.
పొంగి ప్రవహిస్తున్న వైరా కట్టలేరు : అకాల వర్షాలకు ముందుగా మండలంలో మున్నేరు వైరా కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి వైరా కట్టలేరుకి భారీగా వరద రావడంతో నందిగామ వీరులపాడు మండలం మధ్య కోడలు బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి పల్లగిరి వద్ద కూడా మున్నేరు వాగు ఉదతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో పలు పల్లప్రాంతాల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్స్‌ లోకి వరద నీరు చేరింది. అనాసాగరం గ్రామం వద్ద వేసిన జగనన్న ఇళ్లస్థలాల్లోకి వరదచేరి అడుగుమందం నీరు నిలబడింది.