ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఏడు సంవత్సరాల యింది. 2014 జూన్2న ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇంతవరకు కొత్త రాజధాని అంటూ ఏదీ ఏర్పడలేదు. తాము అధికారంలోకి వస్తే అయిదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం గాలికొదిలేసింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలకు నిలువునా తూట్లు పొడుస్తున్నది. ఇది చాలదన్నట్టు ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని పార్లమెంటులో ఎవరూ అడక్కుండానే పదే పదే ప్రకటిస్తున్నది. తెలుగువారి సహనానికి పరీక్షపెడుతున్నది. ఇంకో వైపు హిందూత్వ ఎజెండాను చాపకింద నీరులా విస్తరింపజేసు ్తన్నది. రాష్ట్రాన్ని మధ్య యుగాల నాటి ఆటవిక సంస్కృతివైపు నెట్టాలని చూస్తున్నాయి. త్రిపుర, బెంగాల్ తరహా నీతి బాహ్య రాజకీయాలను, కుటిల ఎత్తుగడలను అనుసరిస్తూ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్నది. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతలు పెరగడానికి, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చడానికి కారణం బిజెపినే. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి నవ్యాంధ్రకు ప్రత్యేక హౌదాను నిర్ద్వంద్వంగా నిరాకరిస్తున్నది. ప్రత్యేక హౌదా లేకపోవడం వల్ల రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతున్నది. ప్రత్కేక హౌదా వుంటే రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు, కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను రాయితీలు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం గ్రాంట్ల రూపంలోను, పది శాతం రుణాల రూపంలోను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక హౌదా నిరాకరించడం వల్ల రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా చాలా నష్టపోయింది. దీనిపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో మొదటి అయిదేళ్లు పాలించిన తెలుగుదేశం కానీ, గత రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్రం వెనుకబాటుకు మీరు కారణమంటే మీరు కారణమని ఈ రెండు పార్టీలు పరస్పరం నిందించుకుంటూ అసలు దోషి బిజెపిని వదిలివేస్తున్నాయి. రాజధాని విషయంలోనూ బిజెపి ఇదే విధమైన ద్రోహం చేసింది. అమరావతి రాజధానికి శంకుస్ధాపన చేసిన ప్రధాని మోడీ, ఈ ఆరేళ్లలో రూపాయి కూడా విదల్చలేదు. చంద్ర బాబు ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని కడతానంటూ అవసరానికి మించి అనేక రెట్లు అధికంగా భూమి సేకరించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రహసనం నడిపారు. అమరావతిని భ్రమరావతిగా మార్చారు. ఆ తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించి రెండున్నరేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనంటూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వ చర్యను కోర్టులో సమర్థించింది. అదే బిజెపి రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తిరుపతిలో అమరావతి రైతుల సభకు హాజరై లెక్చర్లిచ్చింది. ఇటువంటి డబుల్ గేమ్ ఆడడం మనువాద పార్టీకే చెల్లింది. రాజధాని నిర్మాణానికి నిధులివ్వకుండా నాటకాలాడుతున్న బిజెపిని పల్లెత్తు మాట అనడానికి వైసిపి, టిడిపి సిద్ధంగా లేవు. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.. రాష్ట్ర బడ్జెట్‌లో రెవిన్యూ లోటును భర్తీ చేయాలన్న హామీని తుంగలో తొక్కింది. విభజన చట్టం ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు పోలవరం నిర్వాసితులకు పునరావాసం, కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ వంటి హామీలను గాలికొదిలేసింది. వీటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అటువంటి చర్చకు వైసిపి కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కానీ, జనసేన కానీ సిద్దంగా లేవు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పరస్పరం వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ, అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. సిపిఐ(యం) ఇతర వామపక్షాలు మాత్రమే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకోసం మొదటి నుంచి నిబద్ధతతో పోరాడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటానికి బదులు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ బిజెపి ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఈ వైఖరిని మార్చుకోవాలి. రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా నిలవాలి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో పోరాడాలి. తెలుగుదేశం కూడా అవకాశవాద రాజకీయాలకు స్వస్తి పలికి బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలి. రాష్ట్రానికి ద్రోహం చేస్తున బిజెపికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు సాగించే పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి.
- కె. గడ్డెన్న










