Dec 18,2021 06:45

గత ఎనిమిదేళ్లుగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ కు రాచపుండుగా తయారైన ప్రత్యేక హోదా అనే మానని గాయాన్ని తిరిగి కేంద్రం ప్రభుత్వం కెలుకుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో లేదని కొన్నాళ్లు ప్లానింగ్‌ కమిషన్‌ రద్దయి నీతి ఆయోగ్‌ వచ్చినందున వీలు కాదని కొంత కాలం తుదకు 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా చేసిందని ఫలితంగా నిధులు వెసులుబాటు లేదని తేల్చి ఆంధ్రప్రదేశ్‌ కు తిరునామం పెట్టింది. అయితే వడ్డించే వాడు మన వాడైతే ఏ బంతిలో వున్నా ఇబ్బంది లేదన్నట్లు 2017లో ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు 2017 నుండి 2027 వరకు పదేళ్ల కాలానికి పారిశ్రామిక రాయితీల కింద మంత్రి వర్గం తీర్మానంతో 27,415 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఇరువురు నోరు విప్పడం లేదు. కృష్ణా జిల్లాలో సేంద్రియ వ్యవసాయం పరిశీలన పేరుతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలుసుకున్న సమయంలో ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించితే వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సమాధానం దాట వేశారు.

అయితే ఉరుములు లేకుండా పిడుగులు పడ్డట్టు అదే అధికారి బీహార్‌ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలో వుందని వదలిన ఫీలర్‌ ఆంధ్రప్రదేశ్‌ లో పెద్ద దుమారం లేపింది. దారిద్య్ర రేఖకు దిగువన వున్న ప్రజల శాతం అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా బీహార్‌ లో వున్నందున ఈ ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఈ అంశానికి ప్రత్యేక హోదాకు సంబంధమే లేదు. ప్రత్యేక హోదాకు, ఆంధ్ర ప్రదేశ్‌ కు వుండిన లింకు కూడా పరిశీలిద్దాం.
1969లో 5వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అనే పథకం ప్రతిపాదించింది. ఇందుకు అయిదు ప్రామాణికాలను నిర్దేశించింది. 1.కొండ ప్రాంతాలు. సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులుండాలి. 2.తక్కువ జన సాంద్రత వుండి గిరిజన జనాభా ఎక్కువ వుండే ప్రాంతాలుండాలి. 3. ఇరుగు పొరుగు దేశాల సరిహద్దులు కలిగి వ్యూహాత్మక రాష్ట్రమై వుండాలి. 4. ఆర్థిక మౌలిక వసతుల్లో వెనుకబాటుతనం వుండాలి. 5.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనుగడ సాగించలేని విధంగా వుండాలి (నాన్‌ వయబుల్‌ నేచర్‌).
తొలుత అసోం, నాగాలాండ్‌, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. అనంతరం మిగిలిన మొత్తం 11 రాష్ట్రాలకు కల్పించారు. ఈ పథకాన్ని ప్లానింగ్‌ కమిషన్‌ రూపకల్పన చేసి జాతీయాభివద్ధి మండలి సమావేశంలో ప్రవేశ పెట్టగా ఆమోదం లభించినది. ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా ప్రత్యేక హోదా అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ విషయం వచ్చేసరికి ఎగ్గొట్టేందుకు చట్టంలో లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయించింది.
రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభ ఆమోదానికి వచ్చిన సందర్భంలో 2014 ఫిబ్రవరి 20వ తేదీ అప్పటి బిజెపి ప్రతిపక్ష నేతలు ఇప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అరుణ్‌ జెట్లీ ఈ ప్రతిపాదన తెచ్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆమోదించి ఆ పాటికే లోక్‌సభలో బిల్లు ఆమోదం పొంది వున్నందున చట్టంలో చేర్చే వీలు లేదని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి ప్లానింగ్‌ కమిషన్‌ పంపడం జరిగింది. తర్వాత ఏం జరిగిందీ అందరికి తెలుసు.
అయితే ఈ రోజు బీహార్‌ కు ప్రత్యేక హోదా ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? ఆ రోజుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్‌తో వుండటం, తుదకు రాజధాని కూడా లేకపోవటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనుగడ సాగించ లేని విధంగా వుండటంతో...అంటే 5వ ఆర్థిక సంఘం నిర్దేశించిన నాలుగైదు అంశాలు ఆంధ్రప్రదేశ్‌ కు సరిపోతాయని ఈ ప్రతిపాదన తీసుకు వచ్చారు. బీహార్‌ అంశానికొస్తే తుదకు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో గాని ఇప్పుడు ప్రచారంలో వున్నట్లు దారిద్య్ర రేఖకు దిగువన వుండే ప్రజలు ఎక్కువగా వుండటం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం సరిపోదు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర విభజన నాటి కన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేడు పూర్తిగా దిగజారిపోయి వుంది. ఇందుకు కారణాలు ఏవైనా (కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు) అప్పు పుడితే గాని పూట గడవని స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ వుంది. ఈ అంశంలో బీహార్‌ ఎంతో మెరుగు. కాని కేంద్ర ప్రభుత్వ ధోరణి వేరుగా వుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో వివిధ పార్టీలు లేదా కూటమి కేంద్రంలో అధికారం చలాయించాయి. కాని నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఏ రాష్ట్రానికైనా భిక్షం పెట్టాలన్నా రాజకీయ ప్రయోజనాలు పరిగణన లోకి తీసుకొనే దుర్మార్గం అమలు జరుగుతోంది. మరి మున్ముందు ఆంధ్రప్రదేశ్‌ విషయం ఏమౌతుందో చూద్దాం.
గమనార్హమైన అంశమేమంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు బీహార్‌ కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత వరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెబుతున్న సాకులను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు నమ్మే స్థితిలో వుండరు. తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇచ్చితే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పి ఎన్నికల్లో గెలుపొందారు. కాని కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీ రావడంతో తనేమీ చేయలేనని ఇంత కాలం చెబుతున్నారు. ప్రజలు కూడా కామోసు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఏ అర్హత లేని బీహార్‌ ప్రత్యేక హోదా పొందితే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ లాగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఒకవేళ కేంద్రం ఎగనామం పెట్టినా రాష్ట్ర ప్రజలు కొంత మేరకు నమ్ముతారు. కాని క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఒక విధంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా తటస్థించింది.
            

                ప్రత్యేక హోదా : కేంద్రం కుటిల నీతి      / వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు, సెల్‌ : 9848394013 /