మదనపల్లె అర్బన్ : ప్రత్యేక హోదా, ప్యాకేజి, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపు తోపాటు విభజన హామీలన్నీ అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత వేగంగా అభివద్ధి చేస్తామని తిరుపతి సభలో ప్రజలకు వాగ్దానం చేసిన నరేంద్రమోడీ తొమ్మిదేళ్లయినా ఎందుకు వాటి అమలుకు పూనుకోవడం లేదని విసికె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ ప్రశ్నించారు. సోమవారం స్థానిక విసికె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి సభలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాక, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్ పరం చేస్తూ, సీమాంధ్రుల ఆస్తిని అదానీకి అప్పజెప్పేందుకు బిజెపి రంగం సిద్ధం చేసిందని విమ ర్శించారు. అమిత్ షా, నడ్డా ఏమొహం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని నిలదీశారు. గత ఎన్నికల్లో ప్రజలు చాలా చోట్ల బిజెపికి నోటాకంటే తక్కువ ఓట్లే వేశారని, అయినా వీరికి సిగ్గురాలేదన్నారు. పొత్తులతో మళ్ళీ ప్రజల ఓట్లు దండుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి మునిగిపోయే పడవ లాంటిదని, దానితో ఎవరు జత కట్టినా మునిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో విసికె, బాస్ సంస్థల నాయకులు ముత్యాల మోహన్, మనోహర్‌రెడ్డి, సొన్నికంటి రెడ్డెప్ప, సూర్య పాల్గొన్నారు.










