బిజెపి, కాంగ్రెస్ దొందూదొందే శ్రీ సిపిఎంకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే సంఘ్ పరివార్ హింస
- విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం శ్రీ కేరళ కమ్యూనిస్టు ఉద్యమ పురిటిగడ్డ కన్నూర్
సిపిఎం 23వ మహాసభ స్వాగతోపన్యాసంలో కేరళ సిఎం పినరయి విజయన్
ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : ప్రత్యామ్నాయ విధానమే తమ మార్గమని కేరళ ముఖ్యమంత్రి, మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్ పినరయి విజయన్ స్పష్టం చేశారు. ''కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు రెండూ ఒకే విధమైన విధానాలను అనుసరిస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాలను నిరంతరం నిర్వహిస్తూనే ఉంది. కేరళలో మేము ఈ ప్రచారాన్ని సరైన స్థాయిలో చేపట్టాము'' అని పేర్కొన్నారు. బుధవారం కేరళలోని కన్నూర్‌లో ఇకె నయనార్ నగర్‌లో సిపిఎం 23వ అఖిల భారత మహాసభ ప్రారంభం అయింది. ఈ సందర్భంగా పినరయి విజయన్ స్వాగతోపన్యాసం చేశారు. ''సామ్రాజ్యవాద రక్షణలో ఉన్న దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా రైతాంగం, కార్మికులు చారిత్రాత్మక పోరాటాల చరిత్ర కన్నూర్‌కు ఉంది. మహౌన్నత కమ్యూనిస్టు నాయకులు ఎకె గోపాలన్, అజీక్‌కోడన్ రాఘవన్, సిహెచ్ కనరన్, చడయన్ గోవిందన్ వంటి వారి జన్మస్థలం ఇది. 1939 డిసెంబరులో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుకు దారి తీసిన సమావేశం కన్నూర్ జిల్లాలోని పరపురం వేదికగా జరిగింది. కన్నూర్‌లో తొలిసారిగా పార్టీ జాతీయ మహాసభకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది మాకు గర్వకారణం.'' అని పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధి, పౌరహక్కుల కోసం జరిగిన పోరాటాల్లో ఇక్కడి యోధులు, ప్రజలు అగ్రగామిగా ఉన్నారని వివరించారు. కరువు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పార్టీ కార్మికులు, రైతులతో పాటు సాధారణ ప్రజలను సంఘటితం చేసిందని తెలిపారు. కులం, మతం ఆధారంగా ప్రజలపై విధించిన వివక్షకు వ్యతిరేకంగా కృష్ణ పిళ్లై, ఎ.కె గోపాలన్, ఇఎంఎస్ నంబూద్రిపాద్ పోరాటాలు చేశారని వివరించారు.
ప్రత్యామ్నాయ విధానాలతో మార్గం
''రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిమిత శక్తిలో ప్రత్యామ్నాయ విధానాలను విజయవంతంగా అమలు చేయడంలో కూడా మేము దేశానికి మార్గం చూపాం. జిఎస్‌టి, రుణాలపై షరతులు విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పరిమిత ఆర్థిక అధికారాలు మరింత పరిమితం చేయబడుతున్నాయి. ఇటువంటి సవాళ్ల మధ్య కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధి, సామాజిక భద్రతపై దృష్టి సారిస్తోంది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడం, ఆహార భద్రత కల్పించడం, నిరాశ్రయులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన ఇళ్లు, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటర్నెట్‌ను ప్రతి పౌరుడి హక్కుగా మార్చడం, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలను ఇబ్బంది లేకుండా అందించడం, వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ఉత్పాదక ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, విధి విధానాలను సులభతరం చేయడం, పర్యావరణాన్ని సృష్టించడం వంటి చర్యలను తీసుకున్నాం'' అని చెప్పారు. ''నిధులు, విధులు, అధికార యంత్రాంగం బదిలీ చేయడం ద్వారా స్థానిక ప్రభుత్వాలకు సాధికారత కల్పించడంలో మేము ముందంజలో ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల ప్రణాళికను అర్థవంతం చేసింది'' అని తెలిపారు.
''రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లైఫ్ మిషన్ ద్వారా 2.79 లక్షల కుటుంబాలకు సురక్షితమైన ఇళ్లను అందించాం. మౌలిక సదుపాయాల రంగంలో విద్యుదుత్పత్తిని విజయవంతంగా పెంచడం, జాతీయ రహదారుల విస్తరణ, మంచి నాణ్యత గల పాఠశాలలు, ఆసుపత్రులను బలోపేతం చేయడం, పారిశ్రామిక కారిడార్‌లను విజయవంతంగా ప్రారంభించడం మొదలైన వాటి ద్వారా మేము ముందుకెళుతున్నాం.'' అని చెప్పారు. ''సెమీ హైస్పీడ్ రైలు వ్యవస్థను అమలు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా 4 గంటల వ్యవధిలో కేరళలోని దక్షిణాది జిల్లా నుండి ఉత్తరాన ఉన్న జిల్లాకు ప్రయాణించడం సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. అధిక మొత్తంలో పరిహారం అందించడం ద్వారా న్యాయం చేస్తూన,ే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని మా ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ అంశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు పార్టీ పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను అమలు చేస్తున్నప్పుడు ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇస్తోంది'' విజయన్ స్పష్టం చేశారు.
ప్రజాదరణను ఓర్వలేకే సంఘ్ పరివార్ హింస
''సిపిఎంకు లభిస్తున్న ప్రజాభిమానాన్ని చూసి సంఘ్ పరివార్, ఇతర మత సంస్థలు, కాంగ్రెస్‌తో సహా హింసను ఆశ్రయిస్తున్నాయి. అందులో భాగంగా మా సహచరుల విలువైన ప్రాణాలను తీశారు. మేము చాలా సహనాన్ని ప్రదర్శిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు'' అని వివరించారు. ''విప్లవ పోరాటాలకు, మత సామరస్యానికి నెలవైన కన్నూర్‌కు మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కన్నూర్‌లో ఈ చారిత్రాత్మక పార్టీ మహాసభను నిర్వహించే పనిని మన సహచరులు ఎంతో ఉత్సాహంతో చేపట్టారు'' అని చెప్పారు. ''మన దేశం ఇప్పుడు ఒక ముఖ్యమైన దశలో ఉంది.పార్టీ మహాసభను రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. పార్టీ విధానాలకు రూపాన్నిచ్చే చర్చల్లో మీరు ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ముగించారు.










