Apr 14,2022 07:25

* పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమం బలోపేతం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
''ప్రత్యామ్నాయ విధాన కార్యక్రమం'' ఆధారంగా వామపక్ష, ప్రజాతంత్ర సంఘటనను నిర్మిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. దీని ఆధారంగా ప్రజా పోరాటాలకు పదును పెడతామని, అదే సమయంలో హిందూత్వ మతవాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తత సమీకరణకు పార్టీ కషి చేస్తుందని పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్‌ భవన్‌)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాన్ని బలపరిచేందుకు తాము కషి చేస్తున్నామని అన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
''దేశంలో నిరుద్యోగం పెరిగింది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ప్రజా సమస్యలకు కేంద్రంలోని అధికారంలో ఉన్న బిజెపి పరిష్కారం చూపెట్టకుండా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతోంది'' అని విమర్శించారు.
''మాతో కెసిఆర్‌ చాలాసార్లు రాజకీయాంశాలపై చర్చించారు. గతంలో కూడా సిపిఎం మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో కేసిఆర్‌ ని కలిశాం. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీ, సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న వైఖరి బిజెపికి వ్యతిరేకంగా ఉంటే, దాన్ని రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగిస్తాం. అలాగే ఆయన వైఖరి స్పష్టం కావాలి. ధాన్యం కొనుగోలు చాలా ముఖ్యమైన అంశం'' అని తెలిపారు.
''జాతీయ స్థాయిలో ఫ్రంట్‌, కూటములు ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదు. కేవలం రాష్ట్రస్థాయిలోనే సాధ్యపడుతుంది. ఎన్నికల ముందు ఏ కూటమి ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. ఎన్నికల తరువాతే ఏ కూటమి అయినా ఏర్పాడుతుంది. బిజెపికి వ్యతిరేకంగా అందరితో కలిసి ముందుకు వెళ్లేందుకు మేము సహకరిస్తాం'' అని తెలిపారు. ''మతోన్మాద రాజకీయాలు ముందుకు తీసుకువచ్చి, ప్రజా సమస్యలను వెనక్కి నెడుతున్నారు. మతం ఆధారంగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, దాని ఆధారంగా బిజెపి ఓట్లు సంపాదిస్తుంది'' అని ఏచూరి విమర్శించారు.
వామపక్ష శక్తుల ఐక్యతను బలోపేతం చేయాలని, ప్రత్యామ్నాయ విధాన కార్యక్రమం, ప్రత్యామ్నాయం ఆధారంగా వామపక్ష, ప్రజాతంత్ర ఫ్రంట్‌ను రూపొందించాలని పార్టీ మహాసభ నిర్ణయించినట్లు చెప్పారు. పాలక వర్గాల విధానాలకు ప్రజల పోరాటాలను ఉధతం చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో హిందుత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల విస్తత సమీకరణకు సిపిఎం కషి చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అందులో భాగమవుతుందా? అని అడిగిన ప్రశ్నకు ''వారు ఏమి చేస్తారో అది కాంగ్రెస్‌ ఇష్టం'' అని ఏచూరి బదులిచ్చారు.
''ఫెడరలిజం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణపై మూడు ముఖ్యమైన సెమినార్‌ల కోసం కాంగ్రెస్‌ను మేము ఆహ్వానించాము. దేశం కోసం ఇవే ముఖ్యమైన సమస్యలని మేము చెప్పాము. కాబట్టి రాజ్యాంగం కట్టుబడి ఉన్న వారందరూ కలిసి రావాలని కోరాం. దురదష్టవశాత్తు కాంగ్రెస్‌ కలిసి రాలేదు. సెమినార్లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు'' అని ఆయన అన్నారు. ''అందుకు వారే సమాధానం చెప్పాలి. మేము ఎన్నికల రాజకీయాలను కాకుండా దేశం, రాజ్యాంగం, ప్రజలు ఈ మూడింటినే ఈ రోజు అత్యంత ముఖ్యమైన అంశాలను చెబుతున్నాము. అందరూ కలిసి రావాలి. ఒకవేళ వారు వచ్చినా రాక పోయినా వారి ఇష్టం'' అని పేర్కొన్నారు.
పార్టీ 23వ మహాసభ విజయవంతం
తమ పార్టీ 23వ మహాసభ కేరళలోని కన్నూర్‌లో ఏప్రిల్‌ 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు విజయవంతంగా జరిగాయని అన్నారు. అన్ని స్థాయిల్లో మతతత్వం, రాజకీయ, సైద్ధాంతిక, సామాజిక, సాంస్కతికతో పాటు వివిధ అత్యవసర సమస్యలపై సిపిఎం వైఖరిని చేస్తూ 22 తీర్మానాలు ఆమోదించినట్లు వెల్లడించారు. పార్టీ మహాసభ తన రాజకీయ తీర్మానం ద్వారా స్పష్టమైన వైఖరిని తీసుకుందని తెలిపారు. ''బిజెపిని ఒంటరి చేయడం, ఓడించడం'' తమ ప్రధాన కర్తవ్యమని మహాసభ నొక్కి చెప్పిందని అన్నారు. .
బిజెపిని ఏకాకిని చేసి ఓడించే లక్ష్యం నెరవేరాలంటే, సిపిఎం స్వతంత్ర బలం గణనీయంగా పెరగడం, దాని రాజకీయ జోక్య సామర్థ్యాన్ని మరింతంగా ఉండేలా చేయడం అత్యవసరమని మహాసభ పేర్కొన్నట్లు ఏచూరి వివరించారు. పార్టీ మహాసభ రాజకీయ నిర్మాణ నివేదికలో వివిధ రాజకీయ నిర్మాణ పనులపై నిర్ణయం తీసుకుందని, ఆమోదించిందని తెలిపారు. మహాసభ అమోదించిన వాటిని,పార్టీ అమలు చేస్తుందని అన్నారు. పార్టీ మహాసభ ఐక్యతను బలోపేతం చేయాలని, హిందూత్వ సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించిందని తెలిపారు.
దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు దేశభక్తులంతా కలిసి రావాలని పార్టీ మహాసభ విజ్ఞప్తి చేసిందని అన్నారు.