ప్రజాశక్తి - రాయచోటి : రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వివిధ అభివద్ధి పనులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు త్వరగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ గిరీష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అటవీ శాఖతోపాటు ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట ఎస్టీలకు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న అటవీ భూమిని, చిట్వేలి మండలంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమి 99 ఎకరాలను వ్యవసాయ సాగులో భాగంగా అటవీశాఖకు కేటాయించాలని సూచించారు. సుండుపల్లి - రాజంపేట అటవీ మార్గంలో ప్రస్తుతం ఉన్న ఆర్‌అండ్‌బి రోడ్డుకు అదనంగా వెడల్పు కోసం సేకరిస్తున్న అటవీ భూమి బదులు 39 ఎకరాలు ప్రభుత్వ భూమిని చిట్వేలి మండలంలో అటవీశాఖకు అప్పచెప్పాలని అధికారులను ఆదేశించారు. రాజంపేట పరిధిలోని ఏకిరిపల్లి, బిగడపల్లి, చింతలకోనలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటుకు గుర్తించిన ప్రదేశంలో ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వాలని సూచించారు. ఇచ్చిన ఫారెస్ట్ ల్యాండ్‌కు బదులుగా ప్రభుత్వ భూమిని ఇస్తారని చెప్పారు. రాజంపేటలో నగరవరం ఏర్పాటుకు 35 హెక్టార్లు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వం అప్పగించిందని ఆ పనుల వెంటనే మొదలుపెట్టాలని అధికారులను సూచించారు. ఇంకా అభివద్ధి పనులకు సంబంధించి అటవీ పరిధిలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని చెప్పారు. హొసమీక్షలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాజంపేట, రాయచోటి ఆర్‌డిఒలు కోదండరామిరెడ్డి, రంగస్వామి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి నాగమనేశ్వరి, రాయచోటి, మదనపల్లి మున్సిపల్ కమిషనర్లు రాంబాబు, ప్రమీల, డిపిఒ ధనలక్ష్మి, భూ సేకరణ విభాగపు సూపరింటెండెంట్ నాగభూషణ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఆర్‌అండ్ బి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.










