ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : స్పోర్ట్స్ కోటాలో ఎంబిబిఎస్ సీటు సాధించి కాటూరి మెడికల్ కాలేజ్‌లో విద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్థిని నెప్పల్లి సాత్వికను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఫినిక్స్ గ్రీన్‌వ్యాలీ రెడ్‌శాండిల్ ఫామ్‌ల్యాండ్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభాస్కరరావు మానికొండ అన్నారు. నేషనల్ స్పోర్ట్స్‌డే సందర్భంగా లబ్బీపేటలోని ఫినిక్స్ గ్రీన్‌వ్యాలీ కార్యాలయంలో బుధవారం ఉదయం నెప్పల్లి సాత్వికను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాత్వికను ప్రోత్సహిస్తూ ఫినిక్స్ గ్రీన్‌వ్యాలీ సంస్థ తరఫున రూ.5వేలు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా నాగభాస్కరావు మానికొండ మాట్లాడుతూ, తనకు పెద్దగా చదువు లేకపోయినా విద్యార్థులను ప్రోత్సహించడం తనకు ఎంతో ఇష్టమన్నారు. సాత్విక 7వ సంవత్సరం నుంచి విద్యతో పాటు చెస్ క్రీడలో రాణిస్తూ 15వ ఏటలోనే జాతీయ స్థాయిలో ఆడడం ద్వారా ప్రతిభ కనబరచడంతో పాటు భారతదేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడం అభినందనీయం అన్నారు. తద్వారా సాత్విక ఎంబిబిఎస్ కోటాలోని 16 సీట్లలో ఒక సీటును కేవలం తన ప్రతిభతో కైవసం చేసుకోవడం యువతకు ఆదర్శం అన్నారు. యువత నేడు సెల్‌ఫోన్లు, గేమ్స్‌కు పరిమితం కాకుండా ఎన్నో రకాల క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా ఉపాధి అవకాశాలు సాధించే దిశగా కషి చేయాలని నేటి యువతకు సూచించారు. కార్యక్రమంలో సాత్విక తల్లిదండ్రులు వరప్రసాద్, లక్ష్మీ, పలువురు కుటుంబ సభ్యులు, ఫినిక్స్ గ్రీన్‌వ్యాలీ మార్కెటింగ్ సభ్యులు యు.సలోమాన్, డి.నాగేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, టి.పవన్‌కుమార్, రాము, బోసు తదితరులు పాల్గొన్నారు.










