Dec 17,2022 21:23

విద్యార్థుల నమూనాలను పరిశీలిస్తున్న మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ

          ప్రజాశక్తి-హిందూపురం   ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్‌ పట్ల విజ్ఞానాన్ని పెంపొందించుకుని శాస్త్రవేత్తగా తయారై దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డిఎన్‌.ఇంద్రజ పిలుపునిచ్చారు. సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని చిన్మయ విద్యాలయలో విద్యార్థుల తయారు చేసిన నమూనాల ప్రదర్శనను ఛైర్‌పర్సన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన నమూనాలను తిలకించారు. ఇందులో వాతావరణ కాలుష్య నివారణ, ప్లాస్టిక్‌ నిషేధం తదితర నమూనాలను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఇంద్రజ మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాలపై పట్టు సాధించాలని అన్నారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి నూతన ఆలోచనలు వినూత్న ఆవిష్కరణలతో ముందుకు సాగితే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. అంతేగాకుండా విద్యార్థులు చిన్నతనం నుంచే ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జయప్ప, గిరీష్‌, మల్లికార్జున, విద్యాలయ ఆచార్యులు శ్రీవత్స చైతన్య, విద్యాలయ కరస్పాండెంట్‌ డి.ఎల్‌ .భీమరాజు, రఘునందన్‌ గుప్తా, విద్యాలయ ప్రిన్సిపల్‌ వీర శేషయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.