హైదరాబాద్ : యువతకు ఉద్యోగ భరోసా కల్పించాలంటూ... వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ప్రకటించారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె, పార్టీ అడహక్ కమిటీ సభ్యులు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడుతూ... నిరుద్యోగ యువత కోసం గత ఏప్రిల్ 15 నుంచి 72 గంటలపాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ కేలండర్ ను రూపొందించాలని శోభన్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్ ఖాన్, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.










