Jan 28,2023 21:13

- సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వర్‌రెడ్డి

 రాయచోటి టౌన్‌ : ఆర్‌జెడి ప్రతాపరెడ్డి విద్యాశాఖ అధికారా, లేక వైసీపీ ప్రతినిధా అని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం రాయచోటిలో పదవ తరగతి విద్యార్థుల పరీక్షల సమీక్షా సమావేశం పేరుతో ఆర్‌జెడి ప్రతాప్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారని పేర్కొన్నారు. నిజంగా ఆయన సమీక్ష చేయదలుచుకుంటే మీడియా సమక్షంలో సమీక్ష చేయాలే తప్ప, రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో భాగంగా ఎంఇఒలను, హెచ్‌ఎంలపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టడం కోసం కషి చేయడమే అన్నారు. టీచర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరికలు జారీ చేస్తూనే, అత్యున్నత అధికారైన ఆర్‌జెడి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం నేరం కాదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఎన్నో పోరాటాల ఫలితంగా సౌకర్యాలు పొందిన విషయం ఆర్‌ డి విస్మరించి వైసిపి ఘనతగా కీర్తించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ మీద భక్తి ఉంటే ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాలే తప్ప అధికార దుర్వినియోగదానికి పాల్పడటం చట్టారీత్యా నేరం అన్నారు. ఆర్‌జెడి వైఖరికి నిరసనగా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. బాహాటంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్‌జెడి ప్రతాప్‌ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, సి.హెచ్‌.చంద్రశేఖర్‌, పందికాళ్ల మణి, నాయకులు జయరామయ్య పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

కలం అమరవీరులను స్మరించుకోవాలి
ప్రజాశక్తి-పీలేరు
పోలీసు, మిలటరీ తరహాలో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తూ తమ అసువులు బాసిన కలం వీరులైన పాత్రికేయులను సైతం సమాజం సదా స్మరించుకోవాలని కడప యోగి వేమన విశ్వ విద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. 'భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు పత్రికలు, జర్నలిజం పాత్ర' అనే అంశంపై పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సెమినార్‌ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనికులు, పోలీసులు దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలు బలి చేస్తే.., సమాజంలో ఉంటూ సమాజంలోని రుగ్మతలు, కుంభకోణాలు, అసాంఘిక శక్తుల చర్యలను బహిర్గతం చేసి ప్రజలకు తెలియజేయాలన్న ఏకైక నిస్వార్థ సంకల్పంతో పనిచేస్తున్న అనేకమంది పాత్రికేయులు తమ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రతి ఏడాదీ సుమారు 900 మంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోవడం, అదృశ్యమవడం జరుగుతోందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తుల చేతుల్లో భౌతిక దాడులకు గురౌతున్నవారు, వేధుల్లో ఉండగా మానసిక వేధింపులకు గురవుతున్న వారు లెక్కకు మించి ఉన్నారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత శ్రేయస్సు వదిలి నిత్యం ఉరుకుల పరుగులు, పాలకుల వేధింపులు, అధికారుల ఈసడింపులు, తోటి వారి హేళనలకు గురవుతూ కూడా తమ లక్ష్యం నుంచి పక్కదారి పట్టకుండా నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలన్నారు. అప్పుడే నిజమైన వార్తలు వెలుగులోకి వస్తాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటీషు పాలకుల దోపిడీలను ప్రజలకు తెలియజేసే అనేకమంది పాత్రికేయులను బ్రిటిష్‌ వారు ఇబ్బందులకు గురిచేసినప్పటికీ భారతీయ సమాజం వారిని అక్కున చేర్చుకుందని గుర్తు చేశారు. తెలుగు అధ్యాపకులు నీరజ మాట్లాడుతూ సతీహిత బోధ, హిందూ సుందరి, అనసూయ, సావిత్రి లాంటి స్త్రీల పేరుతో వచ్చిన తెలుగు పత్రికలు స్వాతంత్య్ర ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా భాగస్వాములు కావడానికి ఎంతో దోహదపడ్డాయన్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం, ప్రాత్య పరిశోధనా సంస్థ ఆచార్య బిసి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం నాటి స్ఫూర్తిని నేటి పత్రికలు అనుసరించాలని హితవు పలికారు. ప్రజాహితం కోసం పనిచేసే పత్రికలను అక్కున చేర్చుకోవడానికి నేటితరం పాఠకులు కూడా సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని పత్రికల యాజమాన్యాలు గుర్తించాలన్నారు. అనంతరం సదస్సు సమన్వయకర్త డాక్టర్‌ కరణం శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సదస్సుకు హాజరైన వక్తలు, అధ్యాపకులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ వాసు, డాక్టర్‌ ఈశ్వర్‌ బాబు, డాక్టర్‌ యువశ్రీ, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి, పరిశోధక విద్యార్థులు, వేద కళాశాలల అధ్యాపకులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.