May 10,2023 21:07

ఫొటో : మాట్లాడుతున్న అఖిలపక్షం నేతలు

ప్రతాపన్న దోపిడీ జగనన్నకు చెబుదాం..
- అఖిలపక్షం నేతలు
ప్రజాశక్తి-కావలి : కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దోపిడీ అరాచకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి చెబుదాం అని కావలి అఖిలపక్ష నేతలు ఘాటు విమర్శలు చేశారు. బుధవారం పట్టణంలోని జర్నలిస్ట్‌ క్లబ్‌లో అఖిలపక్ష నేతలు పసుపులేటి పెంచలయ్య (సి.పి.ఎం.), చింతాల వెంకట్రావు(కాంగ్రెస్‌), కొప్పర్తి నాగరాజు(సిపిఐ), జ్యోతి బాబురావు(టిడిపి), పొబ్బా సాయివిఠల్‌ (జనసేన) మాట్లాడారు. ''జగనన్నకు చెబుదాం!'' అని మీ పార్టీ ఒక పోగ్రాం పెట్టారని, అందుకే ''జగనన్నకు మేము చెపుతున్నాం ''కావలిలో కణం కణం కబ్జా, అణువనువు అవినీతి, దిక్కుదిక్కు, దోపిడీ పేరుతో ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ నాలుగు సంవత్సరాలలో దోపిడీలో రాష్ట్రంలో కావలి రికార్డులు బద్దలు కొట్టారన్నారు. దీనిపై జగన్మోహన్‌ రెడ్డి దృష్టి సారించాలన్నారు. గతంలో ఇక్కడ జరిగిన అవినీతికి కారణం సుకుమార్‌ రెడ్డి అని పక్కన పెట్టారని చెప్పే ఎంఎల్‌ఎ ప్రతాప్‌ రెడ్డి, - సుకుమార్‌ రెడ్డి ఉన్నప్పుడు టిప్పర్‌ గ్రావెల్‌ రూ.4 వేలు అమ్మితే, ఇప్పుడు రూ.7 వేలు అమ్ముతున్నారన్నారు. మరి ఇప్పుడు దోపిడీకి పాల్పడుతున్నవారు ఎవరో తెలపాలన్నారు.
అసలు సుకుమార్‌ రెడ్డి అవినీతి చేసి ఉంటే, దానికి ఎంఎల్‌ఎ ప్రతాప్‌ కుమార్‌ రెడ్డికి సంబంధం లేకపోతే, ఎందుకు ఎంక్వయిరీ వేసి నిజాలు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అయితే సుకుమార్‌ రెడ్డిని పక్కన పెట్టాక కూడా, కావలిలో గ్రావెల్‌ మాఫియా, ఇసుక మాఫియా కొనసాగుతుందన్నారు. దీనికి కారణం ఎంఎల్‌ఎ ప్రతాప్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. అలానే కావలిలో ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని, రోడ్లు, డ్రెయినేజీలు, వాటర్‌ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటన్నా, పట్టించుకొనే నాథుడు లేరన్నారు. పెద్ద పవని రోడ్డులో ప్లైఓవర్‌ బ్రిడ్జి కానీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితి ఉందన్నారు. అయినా ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌ రెడ్డికి ఇలాంటి సమస్యలు ఏమి పట్టవన్నారు. కావలిలో సామాన్యులు ఏ పని కావాలన్నా, ఇన్కమ్‌ ట్యాక్స్‌, జిఎస్‌టి లాగా కావలిలో ట్యాక్స్‌ చెల్లించక తప్పదన్నారు. ఇక్కడ జరిగిన దోపిడీ, భూ కబ్జాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి ప్రతాపన్న చెర నుంచి కావలిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో అలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయుకులు పసుపు లేటి మహేష్‌, టిడిపి నాయకులు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.