ఆందోళన చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు
ప్రసూతి వైద్యశాల ఎదుట ఆందోళన
- 'లిఫ్టు'లు అందుబాటులోకి తీసుకురావాలి
నెల్లూరు:నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణంలోని ప్రసూతి ఆసుపత్రిలో మరమ్మత్తులకు గురైన లిఫ్టులను సరిచేసి అందుబాటులోకి తీసుకురావాలంటూ డివైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని ఎసిఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి, చిన్నపిల్లల విభాగం ఎదుట డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సిపిఎం రూరల్ కార్యదర్శి బత్తల కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ప్రసూతి, చిన్నపిల్లల విభాగానికి వైద్యం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గర్బీణీలు, బాలంతలు వస్తుంటారన్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళల్లో పెద్ద ఆపరేషన్ చేయించుకొని నడవలేని పరిస్థితిలో ఉండే మహిళలు ఉంటారన్నారు. ఈ మహిళలు వైద్యపరీక్షలు చేయించుకున్న అనంతరం ఆరోగ్య రీత్యా ప్రసూతి విభాగంలోనే ఉండి చికిత్సలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ అయిన మహిళలు వార్డులలో ఉండి చికిత్స ల నిమిత్తం డాక్టర్ల వద్దకు వెళ్ళాల్సి ఉంటుందని, ఆ సమయంలో లిఫ్టులు పనిచేయకపోవడం కారణంతో మహిళల బాదలు వర్ణణాతీతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం కోసం వస్తున్న వారికి కనీస సౌకర్యాలు సైతం లభించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యశాల అధికారులు, జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రసూతి, చిన్న పిల్లల విభాగంలో లిప్టులకు మరమ్మత్తులు చేయించి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అధికారులు స్పందించని పక్షంలో నగరంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండా ప్రసాద్, డివైఎఫ్‌ఐ నాయకులు కండే కోటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు సంతోష్, సుకుమార్, సనత్, కృష్ణ , డి.రాజు,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.










