Apr 06,2022 06:49
  • పార్టీ సారథులు

సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 19న మద్రాసులో జన్మించారు. ఆయన తాత గారు మద్రాసులో వకీలుగా పనిచేస్తూ, రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం గుంటూరులో ఏర్పాటైన హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండేళ్ల తరువాత రాష్ట్ర రాజధానికి హైకోర్టు మారడంతో అక్కడికి మారారు. సీతారాం ఏచూరి తండ్రి ఎపిఎస్‌ ఆర్టీసీలో పనిచేశారు. ఆయన బదిలీల రీత్యా ఏచూరి చదువు గుంటూరు, ఏలూరు, విజయవాడలలో ఒక్కో సంవత్సరం సాగింది. తరువాత హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూలు, నిజాం కళాశాలలో సీతారాం చదువుకున్నారు. 1968లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల ఒక సంవత్సరం చదువును కోల్పోగా, 1969లో ఆయన ఢిల్లీకి వెళ్లారు. 12వ తరగతిలో 1970లో సీతారాం ఏచూరి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. 1970-73లో సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్‌ చేసి, 1975లో జెఎన్‌యులో ఎంఎ పూర్తి చేశారు. ఎమర్జెన్సీకి ముందు 1975లో సిపిఎంలో చేరారు. 1977 నుంచి జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షునిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
    1984లో సిపిఎం కేంద్ర కమిటీకి శాశ్వత ఆహ్వానితునిగా ఎన్నికయ్యారు. 1985లో జరిగిన 12వ పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికై, 1986లో పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరారు. 1988లో తిరువనంతపురంలో జరిగిన 13వ పార్టీ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. సోషలిస్టు దేశాల్లోనూ, ఇతర దేశాల్లోనూ పర్యటించారు. అంతర్జాతీయ రాజకీయాలను అధ్యయనం చేశారు.
    ఎమర్జెన్సీ కాలంలో ఏచూరి కొన్ని నెలల పాటు అజ్ఞాత జీవితం గడిపాక, శస్త్ర చికిత్స జరిగి ఇంటికి వచ్చిన తండ్రి గారిని చూసేందుకు రాగా .. పోలీసులు అరెస్టు చేశారు. తరువాత పార్టీ ఆదేశం మేరకు బెయిల్‌ పొంది, అజ్ఞాతంగా వుంటూ పార్టీ పనులు నిర్వర్తించారు. 2015లో విశాఖలో జరిగిన పార్టీ 22వ మహాసభ సీతారాం ఏచూరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది.