- పెళ్ళిచూపులకూ కాపాలా ఉంటున్నారు
- పోలీసుల తీరుపై బాధితులు
రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అదేమని అడిగితే కొడుతున్నారని,తప్పుడు కేసులు పెడుతున్నారని పలువురు బాధితులు వాపోయారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడిన వీరు తమ అనుభవాలను వివరించారు. ఇళ్లలో జరుగుతున్న కార్యక్రమాలకు వెళ్లనీయడం లేదని, పెళ్లి చూపుల్లో కూడా కాపాలా ఉంటున్నారని చెప్పారు. బాధితులు చెప్పిన కష్టాలు వారి మాటల్లోనే క్లుప్తంగా :
బాధిత మహిళలపై 307 సెక్షన్ కింద కేసులు

'బొబ్బిలిలోని మైథాన్ కంపెనీలో సుమారు 230 మంది కార్మికులను తొలగించారు. యాజమాన్యం వారికి అనుకూలమైన వారిని తెచ్చిపెట్టుకున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరితే యాజమాన్యం తరుపున రౌడీలు కార్మికులపై దాడికి దిగారు. వారికి వత్తాసుగా పోలీసులు కూడా కార్మికులను కొట్టారు. దీన్ని చిత్రీకరించిన మీడియా ప్రతినిధులను బెదిరించారు. చివరకు 69 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 39 మంది మహిళలపై సెక్షన్ 307 కింద కేసు పెట్టి ఇప్పటికీ జైల్లో ఉంచారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. అంగన్‌వాడీలు దీక్ష చేస్తామంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారిందరికీ నోటీసులు ఇచ్చారు. కర్నూలులో హరిత అనే మహిళ ఇంటికి వెళ్లి పోలీసులు వేధించారు. పొలానికి వెళితే అక్కడకు వెళ్లి మరీ అరెస్టు చేశారు. పెళ్లి చూపులు పెట్టుకుంటే అక్కడా పోలీసులు కాపలా ఉంటున్నారు. మానవ హక్కులకు పూర్తిగా భంగం కలిగిస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.'
సుబ్బరావమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
అడిగితే చావబాదారు

'ఆస్పరిలో బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని అడిగినందుకు అర్థరాత్రి ఇంటికి వచ్చి గుడ్డలు డదీసి రోడ్డుపై కొట్టారు. అడ్డుకున్న ఇద్దరు విద్యార్థులనూ చావబాదారు. వారిని కొడుతుంటే రెండు ఫైబర్ లాఠీలు విరిగిపోయాయి. పోలీసుస్టేషన్ అంతా రక్తం చిందింది. అంతటితో ఆగకుండా కాల్చి చంపుతానంటూ తుపాకీతో బెదిరించారు. ఇదెక్కడి న్యాయం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? ప్రభుత్వం కూడా పోలీసులను ఇష్టారాజ్యంగా వినియోగిస్తుండటంతో వారికి అలుసయిపోయింది. ఇటువంటి వాటిని సహించేది లేదు.
విరూపాక్ష, సిపిఐ ఆస్పరి మండల కార్యదర్శి
79 కేసులు పెట్టారు

'అమరావతి పరిరక్షణ కోరుతూ న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేసేందుకు పోలీసులను అనుమతి కోరాము. ఇవ్వలేదు. కోర్టుకెళ్లి తెచ్చుకున్నాము. అమరావతి నుండి తిరుపతి వరకూ 45 రోజులు పాదయాత్ర చేపట్టాము. ఈ సమయంలో దాడిపొడవున ఉన్న అన్ని పోలీసుస్టేషన్లలో అందులో పాల్గొన్న నాతోపాటు మరికొంతమందిపై 79 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇంతకంటే నిరంకుశత్వం మరొకటి ఉండదు. హైకోర్టు ఆర్డర్ మేరకు సభ ఏర్పాటు చేసుకుంటే అందులో పాల్గొన్న వారందరిపైనా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తోచిన విధంగా చేసుకుపోతోంది. ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యమేలుతుంది.
శివారెడ్డి, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్
పారిపోవాల్సి వస్తోంది

'ఇటీవల ధర్నా చేస్తామని చెబితే ఇంటికి పోలీసులను పంపించారు. ఇంటి చుట్టుపక్కల వారు పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోతు న్నాము. దీంతో ఇంటినుండి పారిపోయి ఎక్కడో ఉండాల్సివస్తోంది.వార్డు సెక్రట రీలు, వాలంటీర్లు రోజులో కనీసం పదిసార్లు ఇంటికి వచ్చి విచారిం చారు. రేపల్లె నుండి విజయవాడ రావడానికి నాలుగు బస్సులు మారాల్సి వచ్చింది.
ధనలక్ష్మి శ్రామిక మహిళా ఫోరం(ఎఐటియుసి)
రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు
'రాష్ట్రంలో పోలీసుల తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కనీస చట్టాలను మర్చిపోతున్నారు. తోచిన విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను పోలీస ులు పూర్తిగా వదిలేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కనీస హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ?'
ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు
స్కూల్లో పోలీసులను పెట్టారు

'ఇటీవల పిఆర్‌సిపై నిరసన వ్యక్తం చేస్తున్నారనే పేరుతో స్కూల్లో పోలీసును పెట్టి మరీ పాఠాలు చెప్పిస్తున్నారు. ఇంతకంటే నియంతృత్వం మరొకటి లేదు. దీనివల్ల పిల్లలు ఏమైపోవాలి? భయ భ్రాంతుల మధ్య టీచరు ఏమి చెబుతాడు? . పిల్లలు ఏమి వింటారు. కరోనా కాలంలో అయితే మద్యం దుకాణాల వద్ద క్యూలు సరిచేయించేందుకు టీచర్లను పెట్టారు. దేశంలో ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ వచ్చి ఉండదు'
సాయిశ్రీనివాస్, ఉపాధ్యాయులు
సమావేశానికి అడ్డుచెబుతున్నారు

'దళిత బహుజనుల సమస్యలపై చర్చించేందుకు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అందులో మహా అయితే 100 మందికంటే ఎక్కువ పట్టరు. అయినా నాయకుల ఇళ్లకు వెళ్లి సమావేశానికి వెళ్లకూడదని నోటీసులు ఇస్తున్నారు. ఫోన్లు చేసి నిరంతరం వేధిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. అమరావతిలో ఎస్‌సిలపైనే ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసు పెట్టారు. చీరాలలో మాస్కులేదని దళిత యువకుడి మరణానికి కారణమయ్యారు. చిత్తూరులో జడ్జి రామకృష్ణ, విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై కేసులు పెట్టారు. చివరకు సుధాకర్ చనిపోయారు.'
దళిత బహుజన ప్రంట్ అధ్యక్షులు
మేళం భాగ్యారావు










