Jan 13,2023 22:13

ఐక్యత చాటుతున్న వామపక్ష విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు

          హిందూపురం : విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ సమరయాత్రను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు. వామపక్ష విద్యార్థి, యువజన ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన బస్సుయాత్రను విజయవంతం చేద్దామని కోరుతూ శుక్రవారం నాడు పట్టణంలోని ఎన్జీవో హోంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వామపక్ష విద్యార్థి, యువజన, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆవిషయాన్ని పట్టించుకోలేదన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు కొత్త రాజధాని అభివద్ధి కోసం నిధులు, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత కోసం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ఉపాధ్యాయ, కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల కోసం సమర శంకరావాన్ని ఈ నెల 20 తేదీ నుండి ఫిబ్రవరి 5 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు జరిగే బస్సుయాత్రను జయప్రదం చేయడానికి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాలు ఏకమై ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు బాబావలి, చంద్రశేఖర్‌ రెడ్డి, సంపత్‌ రవికుమార్‌, అభిలాష్‌, మూర్తి, చంద్రశేఖర్‌, హర్ష కుమార్‌, వంశీ, భగత్‌, అభి, చరణ్‌, ఎఐటియుసి నాయకులు శివప్ప, బాబు, వినోద్‌ కుమార్‌, చలపతి తదితరులు పాల్గొన్నారు.