Jul 07,2022 22:49

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: నగరంలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన తెలుగు రాష్ట్రాలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారం - ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సమాచార మాధ్యమాల పాత్ర అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు ఆర్కిటెక్చర్‌ కళాశాల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పివిఎస్‌ శ్యామ్‌ కుమార్‌ తెలిపారు. బెంజిసర్కిల్‌ వద్ద గల కళాశాల కాన్ఫరెన్స్‌ హల్‌లో గురువారం వర్క్‌షాపుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వర్క్‌షాపులో ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లాలోని వివిధ పత్రికా విలేకర్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బంది పాల్గొనవచ్చని తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి. రమణారావు, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ఆర్కిటెక్చర్‌ రిజిస్ట్రార్‌ కె.వి. ఉమామహేశ్వరరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ డిపార్టుమెంట్‌ హెచ్‌వోడి డాక్టర్‌ జి.అనిత, ది హిందూ రిటైర్డ్‌ డిప్యూటీ బ్యూరో చీఫ్‌ జి.వెంకట రమణారావు, ప్రముఖ సైన్సు రచయిత ఎస్‌.వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఈ వర్క్‌షాపులో పాల్గొనేందుకు ఆసక్తి గల జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బంది తమ పేర్లను, చిరుమానాను జులై 12వ తేదీలోగా తమ కళాశాలలోగానీ, 95730 48943 నెంబరుకు వాట్సాప్‌ ద్వారాగానీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్‌ .రామచంద్రయ్య, ఎస్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.