Oct 06,2022 22:39

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చునని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఇండియన్‌ సైక్రియాటిక్స్‌ సోసైటీ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను గుర్తిస్తూ రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను గురువారం కలెక్టర్‌ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కొందరులో పుట్టుకతో మానసిక వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికి మరి కొందరిలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఒత్తిడికిలోనై మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. మానసిక సమస్యలను నివారించి ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉందన్నారు. మానసిక ఆనారోగ్యం శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఇండ్ల రామసుబ్బరెడ్డి మాట్లాడుతూ మానసిక చికిత్స కేంద్రాలకు వచ్చే ప్రతీ 100 మందిలో 25 మంది వృద్దులు ఉంటున్నారన్నారు. వీరిలో ఎక్కువగా డిప్రెషన్‌, నిద్రలేకపోవడం, ఆందోళన వంటి ఆనారోగ్య సమస్యలు ఉంటున్నాయన్నారు. వృద్దాప్యంలో మానసిక రుగ్మతలు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు రాధికారెడ్డి, విశాల్‌ ఇండ్ల, కృష్ణదాస్‌, ఉదయలక్ష్మి, శుభమ్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.
డిసెంబర్‌ నాటికి ఓటుకు ఆధార్‌ అనుసంధానం
ప్రజాశక్తి-విజయవాడ: ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా డిసెంబర్‌ నాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రేషన్‌ లైజేషన్‌ ఆఫ్‌ పోలింగ్‌ స్టేషన్లు, ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానం, ఫారమ్‌-6 బి, ఓటర్ల నుంచి ఆధార్‌ వివరాలు సేకరణ, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్దీకరణ, ఓటర్ల జాబితా రూపొందించడం తదితర అంశాలపై గురువారం నగరంలోని మాంటిస్సోరి కళాశాలలో బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి 1500 మంది ఓటర్ల కన్న ఎక్కువ ఉన్న చోట కొత్త పోలింగ్‌ కేంద్రానికి ప్రతిపాదనలు, సూచనలు, పోలింగ్‌ కేంద్రానికి సంబంధించి పేర్ల మార్పులు, చేర్పులలో భాగంగా పున్నమ్మ తోట మాంటిస్సోరి మహిళ కళాశాలలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేటి వరకు 16,49,533 మంది ఓటర్లు నమోదై ఉన్నారన్నారు. వీటిలో ఇప్పటి వరకు 9,39,341 మంది ఓటర్ల డేటాకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని బిఎల్‌వోలను కలెక్టర్‌ ఆదేశించారు.