Feb 14,2022 21:55
  • యుపిలో 60శాతం, ఉత్తరాఖండ్‌లో 59.37, గోవాలో రికార్డు స్థాయిలో 78శాతం
  • ఇసికి సమాజ్‌వాదీ ఫిర్యాదు

లక్నో : ఉత్తరప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌ల్లో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు వార్తలందలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. యుపిలో సోమవారం జరిగిన రెండో దశలో సాయంత్రం 5గంటల సమయానికి 60శాతంపైగా పోలింగ్‌ నమోదవగా, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 5గంటల సమయానికి 59.37శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. గోవాలో మొత్తంగా 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగగా, రికార్డు స్థాయిలో 78శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా ఎనిుకల అధికారులు ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? అని ఎన్నికల అధికారులు పలుచోట్ల పర్యవేక్షించారు. ఉత్తరాఖండ్‌లో చేతులకు గ్లోవ్స్‌ వేసుకుంటేనే ఓటు వేయడానికి అనుమతించారు.
యుపిలో
రాష్ట్రంలో పోలింగ్‌ మొత్తమ్మీద ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా అల్లర్లు, ఘర్షణలు జరిగినట్లు వార్తలందలేదని యుపి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి బ్రమ్మ దేవ్‌రామ్‌ తివారి చెప్పారు. 9జిల్లాల్లోని 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయమే చలి, పొగ మంచు కారణంగా మందకొడిగా సాగినప్పటికీ కొద్ది గంటల్లోనే పోలింగ్‌ పుంజుకుంది. ఈ దశలో మొత్తంగా 586మంది అభ్యర్ధులు బరిలో వున్నారు. ఈ నెల 10న జరిగిన తొలి దశలో 62.4శాతం పోలింగ్‌ నమోదైంది. 2017 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతాలు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి.
ఇసికి మళ్లీ ఫిర్యాదు చేసిన సమాజ్‌వాదీ
షహరాన్‌పూర్‌లో తమ పార్టీకి ఓటు వేస్తే అది బిజెపికి వేసినట్లుగా రికార్డయిందని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. తమ బృందాలు అక్కడకువెళ్ళి నిర్ధారించాయని అవన్నీ బూటకమనితేలిందని ఎన్నికల అధికారి చెప్పారు. లకోు రేంజ్‌ ఐజి లక్ష్మి సింగ్‌ను బదిలీచేయాల్సిందిగా సమాజ్‌వాదీపార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. బిజెపి టిక్కెట్‌పై పోటీచేస్తున్న తన భర్తకు ఓటు వేయాల్సిందిగా ఆమె ప్రజలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు సమాజ్‌వాదీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ పటేల్‌ ఒక లేఖ రాశారు. ఈ నెల 7, 11 తేదీల్లో కూడా తమ పార్టీ ఇదే డిమాండ్‌ చేసిందని చెప్పారు.
మరో చోట యాదవులను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. బురఖాల్లో వచ్చిన మహిళలు తప్పుడు ఓట్లను వేస్తున్నారంటూ బిజెపి నేత జె.పి.ఎస్‌.రాథోర్‌ ఫిర్యాదు చేశారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని విచారణలో తేలినట్లు తివారి తెలిపారు. లూథియానాలో బిజెపి అభ్యర్థిపై దాడి చేశారంటూ రైతు నేతతో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. షహరాన్‌పూర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతును 70ఏళ్ల మహిళ అంబులెన్సులో వచ్చి స్ట్రెచర్‌ మీద వెళ్లి మరీ ఓటు వేశారు.
బిఎస్‌పి అభ్యర్థి నిర్బంధం
షాజహాన్‌పూర్‌లో మంత్రి ఆదేశాల మేరకు పోలింగ్‌కు ముందుగా పోలీసులు తనను నిర్బంధించారని ఆ నియోజకవర్గ బిఎస్‌పి అభ్యర్థి సర్వేష్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర మంత్రి సురేష్‌ ఖన్నా ఆదేశాల మేరకు తనను ఆదివారం రాత్రి నిర్బంధించారని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత విడుదల చేసినట్లు తెలిపారు. డబ్బు పంచిపెడుతున్నట్లు సమాచారం రావడంతో, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని సోదాచేసినట్లు ఎస్‌పి ఆనంద్‌ తెలిపారు. వాహనంలో ఏమీ లభ్యం కాకపోవడంతో గంటన్నర తర్వాత అతనిని వదిలిపెట్టామని చెప్పారు.
ఉత్తరాఖండ్‌లో
ఉత్తరాఖండ్‌లోని13 జిల్లాల్లోని 70 అసెంబ్లీ స్థానాలకుగానూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 59శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభమయ్యే సమయానికే బూత్‌ల వద్ద పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. సాయంత్రం 5గంటల సమయానికి 59.37శాతం పోలింగ్‌ నమోదైంది. బరిలో 632మంది అభ్యర్థులు వున్నారు. ఖతిమాలో ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి ఓటు వేశారు. హరిద్వార్‌ జిల్లాలో అత్యధిక స్థాయిలో 67.58శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత ఉత్తరకాశిలో 65.55శాతం, ఉదమ్‌సింగ్‌ నగర్‌(65.13), నైనిటాల్‌ (63.12), రుద్రప్రయాగలో 60.36శాతం పోలింగ్‌ జరిగింది.
గోవాలో
గోవాలో పోలింగ్‌ సమయం ముగిసేనాటికి 78శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ముఖ్యమంత్రి సావంత్‌ నియోజకవర్గమైన సాంక్వెలిమ్‌లో అత్యధికంగా 89.64శాతం నమోదవగా, బెనాలిమ్‌ నియోజకవర్గంలో అత్యల్పంగా 70.2శాతం నమోదైంది.