Jan 22,2023 20:37

మదనపల్లె : పరీక్షా కేంద్రం వదద్ద పోలీసులకు సూచనలిస్తున్న ఎస్‌పి హర్షవర్ధనరాజు

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్‌పి హర్షవర్ధనరాజు
13584 అభ్యర్థులకు గానూ 1542 మంది గైర్హాజరు
మాతృత్వాన్ని చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌   ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ /మదనపల్లె అర్బన్‌/ రాయచోటి టౌన్‌
కానిస్టేబుల్‌ నియామకపు అర్హత పరీక్షలు అన్నమయ్య జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లాల్లో రాజంపేట, మనదపల్లెలలో డివిజన్లలో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రాజంపేట, మదనపల్లిలలో 30 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాపితంగా 13684 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 12140 పరీక్షలు రాశారు. మదనపల్లిలో 90 శాతం, రాజంపేటలో 85 శాతం మంది హాజరు నమోదైంది.
మనదపల్లె అర్బన్‌ : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుతో పరీక్షలు నిర్వహించారు. మదనపల్లె డివిజన్‌లో మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 8946 మంది అభ్యర్థులు గాను 8087 మంది పరీక్షలు రాశారు. 857మంది అభ్యర్థులు గైహాజరైయ్యారని డిఎస్‌పి కేశప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాలను అన్నమయ్య జిల్లా ఎస్‌పి హర్షవర్ధన రాజు తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే వారిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి తగు సహాయం అందజేశారు. పోలీసు కానీ స్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష బందోబస్తు సందర్భంగా ముగ్గురు డిఎస్‌పిలు, నలుగురు సిఐలు, 25 నుంది ఎస్‌ఐలు, 37 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 60 మంది కానిస్టేబుళ్లు, 118 మంది మహిళా పోలీసులు మొత్తం 275 మందిని బందోబస్తు ఏర్పాట్లు కోసం నియమించడం జరిగిందని తెలిపారు.
రాజంపేట అర్బన్‌: రాజంపేట డివిజన్‌ పరిధిలో అన్నమాచార్య ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మాస్‌ కాపీయింగ్‌కు చోటు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డిఎస్‌పి శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. మూడు పరీక్షా కేంద్రంలో మహిళా అభ్యర్థులు 914 మంది, పురుష అభ్యర్థులు 3,824 మంది మొత్తం 4738 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 4053 మంది హాజరయ్యారు. 685 మంది గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల నిష్పత్తి 85.54 శాతంగా నమోదైంది.
మాతృత్వాన్ని చాటుకున్న మహిళా కానిస్టేబుల్‌
తప్పు చేసిన వారిని దారిలో పెట్ట డమే కాదు.. అవసరమైతే ఆకలిగా ఉన్న బిడ్డకు కడుపు నింపే తల్లినవుతానని నిరూపించింది ఓ మహిళా కాని స్టేబుల్‌. ఆకలిగా ఉన్న ఓ అభ్యర్థి బిడ్డకు పాలిచ్చి లాలించి నిద్ర పుచ్చింది. వివరాలు.. రాజంపేట అన్నమాచార్య కలాశాలలో ఆదివారం కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఓ తల్లి తన 4 నెలల బిడ్డతో హాజైంది. పసికందును తన తల్లి, భర్తకు అప్పగించి పరీక్ష రాసేందుకు కేంద్రానికి వెళ్లింది. పరీక్ష ప్రారం భమైన అరగంట నుంచి బాబు ఏడు అందుకున్నాడు. అమ్మమ్మ, తండ్రి ఎంత లాలించినా ఏడుపు ఆపలేదు. ఇదంతా గమనిస్తూ అక్కడే విధులు నిర్వహిస్తున్న బాలింత అయిన మన్నూరు మహిళా కానిస్టేబుల్‌ అమరావతి ప్రేమగా దగ్గరకు తీసుకుని పాలిచ్చి లాలించి నిద్రపుచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడే విధుల్లో ఉన్న పోలీస అధికారులు, సిబ్బంది మహిళా కానిస్టేబుల్‌ అమ్మతనాన్ని శ్లాఘించారు. ఆమె మాతృత్వానికి అభ్యర్థి భర్త, తల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.