పుట్టపర్తి అర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎం.హరి జవహర్ లాల్, డా||పోలా భాస్కర్ సూచించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శాసనమండలి ఎన్నికల పోలింగ్ సన్నద్ధతపై జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌తో కలిసి నోడల్ అధికారులతో బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా చెప్పకుండా పాటించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని పకడ్బందీగా, పక్కాగా అమలు చేయాలన్నారు. వేసవి దష్ట్యా పోలింగ్ కేంద్రాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈనెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ సజావుగా జరిగేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ కోసం సిద్ధం చేసే బ్యాలెట్ పేపర్ పై ప్రత్యేక దష్టి పెట్టాలని, అభ్యర్థుల పేర్లు, ఫోటోలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. ఎన్నికలను మానిటర్ చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చాలా ముఖ్యమన్నారు. ఎన్నికల నేపథ్యంలో వస్తున్న ఫిర్యాదులపై వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టభద్రుల స్థానం ఎన్నికల పరిశీలకులు డా||పోలా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులు బాధ్యతగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ నిర్వహించేలా చూసుకోవాలని తెలిపారు. ఈనెల 10వ తేదీన ఇచ్చే శిక్షణ తరగతుల్లో బ్యాలెట్ పేపర్‌పై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన వివిధ రకాల టీంలు నిరంతరం అప్రమత్తంగా పని చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులంతా జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఎస్పీ రాహుల్ దేవ్‌సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను వివరించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వదద పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, సిపిఒ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ రామాంజనేయులు, హౌసింగ్ పీడీ చంద్రమోహన్ రెడ్డి, ఆర్డీవోలు తిప్పేనాయక్, రాఘవేంద్ర, అడిషినల్ ఎస్పీ కెవిఆర్‌కె ప్రసాద్, డిసిఒ కష్ణ నాయక్, డిపిఒ విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










