Mar 10,2023 21:09

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ గిరీష కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, రాజకీయ పార్టీ ఏజెంట్లకు ఒరిజినల్‌ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరని తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించేందుకు పోలింగ్‌ ఏజెంట్లు తప్పనిసరిగా ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు సంయమనం పాటించాలని, ఎన్నికల సంఘం సూచనలను పాటించాలని కోరారు. పోలింగ్‌ ప్రక్రియలో ఏవైనా సమస్యలుంటే స్థానిక తహశీల్దార్‌కు తెలియజేయాలన్నారు. ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పంపిన జంబో బ్యాలెట్‌ బాక్సుల గురించి పార్టీలకు ఆయన అవగాహన కల్పించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు పాల్గొన్నారు.