May 25,2023 21:04

సత్యనారాయణ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

రాయచోటి టౌన్‌ : కార్మిక ఉద్యమ నిర్మాత పర్సా సత్యనారాయణ ఆశయాలను కొనసాగిస్తామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు అన్నారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో పర్సా సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన చిత్రపటానికి సిఐటియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 1970 నుండి 2022 వరకు సిఐటియులో పనిచేశారని తెలిపారు. ఆయన అనేక నిర్బంధాలను ఎదుర్కొని కార్మికుల సమస్యల మీద రాజీలేని పోరాటాలు నిర్వహించారని తెలిపారు. 1924, జూన్‌ 2న జన్మించారని పేర్కొన్నారు. 19 సంవత్సరాల వయ సులోనే నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. కార్మికుల జీవితాలలో వెలుగు నింపడానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశంఖం పూరించడానికి ఆయన ఆధ్యుడిగా నిలిచారని పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ స్థాపించి కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటాలు యూనియన్‌ ద్వారా నిర్వహించారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం కలిగించే లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తున్న నేపథ్యంలో పర్సా పోరాట స్ఫూర్తితో లేబర్‌ కోడ్‌లు, వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దయేంతవరకు ప్రభత్వ సంస్థల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు సి.రవికుమార్‌, సురేంద్ర బాబు, ఓబులమ్మ, జిల్లా కమిటి సభ్యులు శంకర్‌, లక్ష్మిదేవమ్మ నాగరాజమ్మ పాల్గొన్నారు.