Aug 06,2021 06:16

    మానవజాతి చరిత్రలో ఆగస్టు 6 అత్యంత దుర్దినం. మానవ నాగరికత సృష్టించిన అత్యంత భయంకర ఆయుధం ఈ రోజున ప్రయోగించబడి తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించింది. 1945 ఆగస్టు 6 ఉదయం 8.16 నిమిషాలకు అమెరికా ప్రయోగించిన తొలి అణుబాంబు (లిటిల్‌ బారు) జపాన్‌ లోని హిరోషిమా నగరంలో పాఠశాలలకు వెళుతున్న చిన్నారులతో సహా అప్పటికప్పుడు 90,000 మంది ప్రాణాలు హరించింది. 35,000 మందిని క్షతగాత్రులను చేసింది. మరో మూడు రోజులకు ఆగస్టు 9వ తేదీ ఉదయం 11.02 గంటలకు జపాన్‌ లోని మరో నగరం నాగసాకి పై అమెరికా వేసిన రెండో బాంబు (ఫ్యాట్‌ మాన్‌) సుమారు 70,000 మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలో ఇప్పటివరకు మానవులపై ప్రత్యక్షంగా ప్రయోగించబడిన అణు బాంబులు ఈ రెండే. ఇవి సృష్టించిన విధ్వంసం బాంబులు ప్రయోగించబడిన క్షణానికే పరిమితం కాలేదు. ఆ తరువాత నెలలు, సంవత్సరాల పాటు ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కాలిన గాయాలు, అణు రేడియేషన్‌ ప్రభావంతో క్యాన్సర్‌ వంటి వ్యాధులతో మరో లక్షన్నరమందికి పైగా మరణించారు. కొన్ని లక్షల మంది అంగ వైకల్యాలకు గురైనారు. అణుధార్మికతకు గురైన వారి బిడ్డల్లో, వారి తరువాతి తరాల్లో కూడా దాని ప్రభావం కనిపిస్తూనే ఉంది.
    హిరోషిమా, నాగసాకి తరువాత ప్రపంచంలో మరెక్కడా అణు బాంబులను ప్రయోగించ లేదు. కానీ ప్రపంచం లోని 9 దేశాల వద్ద ప్రస్తుతం 16,000 పైగా అణు బాంబులు సిద్ధంగా ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిలతో పోలిస్తే ఈ బాంబులు ఒక్కోదాని విధ్వంసక సామర్ధ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ. అంటే ఈ బాంబులన్నీ పేలితే భూగోళం ఒక్కసారి కాదు, వందల సార్లు భస్మీపటలం అవుతుంది. వీటిలో అమెరికా (7,000), రష్యా (7,000) అత్యధిక బాంబులు తయారు చేశాయి. చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, భారత్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియాల దగ్గర కూడా ఆయా దేశాలను నాశనం చేయగలన్ని అణుబాంబులు వున్నాయి. అణుబాంబుల ప్రయోగించగల సాధనాలు కూడా ఆధునికమైనాయి. నేడు యుద్ధ విమానాలే కాదు, అణుబాంబులను 10,000 కిలోమీటర్లకు పైగా మోసుకుపోయి ఖచ్చితంగా లక్ష్యంపై ప్రయోగించగల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు, అణు జలాంతర్గాములు కొన్ని వేల సంఖ్యలో ప్రపపంచమంతటా మోహరించబడి ఉన్నాయి. ఈ అణ్వాయుధాల వల్ల మొత్తం ప్రపంచానికే ప్రమాదం.