ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అగ్రగామిగా ఉన్న అమెరికానే.. తలదన్నేవిధంగా చైనా ఎదుగుతోంది. శాస్త్ర, సాంకేతికతలతోపాటు, ఆర్థికంగానూ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. చైనా ఈ స్థాయిలో ఎదగడానికి యువత ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. చైనాలో ప్రతి ఏటా మే 4న యువజన దినోత్సవం జరుగుతుంది. 1919 వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. 14 ఏళ్ల వయసు నుంచి.. 28 ఏళ్ల వయసులో వున్న వారు ఈ ఉత్సవంలో ప్రధానంగా పాల్గొంటారు. ప్రతి ఏడాది ప్రత్యేకంగా జరుపుకునే ఈ దినోత్సవాన్ని మే ఫోర్త్ ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఇది చైనీస్ ప్రజలు జర్మనీ, జపాన్ దేశాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం. ముఖ్యంగా ఆనాటి విద్యార్థులందరూ ఆ దేశాలకు వ్యతిరేకంగా సాంస్కృతికంగా, రాజకీయంగా అందరూ ఒకేతాటిపైకి వచ్చి బీజింగ్‌లో నిరసన చేపట్టారు. ఈ ఉద్యమాన్నే మే ఫోర్త్ ఉద్యమం అని అంటారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన కమ్యూనిస్ట్ యూత్ లీగ్ ఆఫ్ చైనా (సివైఎల్‌సి) వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చైనాలో కొన్ని ప్రధాన నగరాల్లో స్మారక కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్ని లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు.

చరిత్రలోకి వెళితే...
ఉత్తర చైనాను ఆక్రమించాలనే జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చైనా కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమం తదనంతరం డిసెంబర్- 9, 1935లో ఈ లీగ్ ఏర్పడింది. అప్పట్లో ఈ లీగ్‌ని సిపిసి (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా) నిర్వహంచింది. ఆ తర్వాత 1957లో దీని పేరు సివైఎల్‌సి (కమ్యూనిస్టు యూత్ లీగ్ ఆఫ్ చైనా)గా మారింది. చైనాలో మూడవ ప్లీనరీ తర్వాత.. 1979లో చైనా కమ్యూనిస్టు పార్టీ యువతలో ప్రత్యేకించి సోషలిజం భావాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకే అక్కడి యువత కమ్యూనిస్టు పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు.
యువతకు ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి యువత... ఈ యుగంలో దేన్ని స్ఫూర్తిగా తీసుకున్నారనేది ప్రశ్నించుకోవాలి.కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుందని చైనా యువత నమ్ముతున్నారు. ఆ వాస్తవాన్నే యావత్ ప్రపంచం ముందుంచుతున్నారు. వారి కోసం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం కూడా కష్టపడతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా కోవిడ్ కాలాన్నే చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్ వల్ల ఆర్థికరంగం కుదేలయింది. యావత్ ప్రపంచ ప్రజానీకం తలకిందులైంది. అయితే వీటన్నింటికీ భిన్నంగా చైనా యూత్, ప్రజలు పారిశ్రామికంగా పురోగతి సాధించారు. అలాగే 1990- 2000ల మధ్య పుట్టిన వారంతా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిని పరిశీలిస్తున్నారు. ఇక ఇతర దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో కూడా వారెంతో ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. ముఖ్యంగా చైనా ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ప్రాముఖ్యతనివ్వడం వల్లే ఇంత అభివృద్ధి సాధ్యమవుతుందని అక్కడి యువత అభిప్రాయపడుతోంది. చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాంగ్ యివు మీడియాతో మాట్లాడుతూ.. 'యువత అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా యువకులు తమ వ్యక్తిగత అభివృద్ధి... యావత్ సమాజాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. దీనికి వారెంతో దృఢసంకల్పంతో ఉండాలి' అని ఆయన అన్నారు. ఇక ఈ ఉత్సవాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడుతూ... 'కొత్త యుగాన్ని యువకులు తమదిగా మార్చుకోవాలి. జాతీయ పునరుజ్జీవనానికి దోహదపడే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికి యువత ఎంతో గర్వంతో, ఆత్మవిశ్వాసంతో, భరోసాతో ఉండాలి' అని ఆయన ఆకాంక్షించారు. అలాంటి లక్ష్యాలను నిర్ధేశించుకుంటేనే... కమ్యూనిస్టు పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా యువత ప్రస్తుతం ఎలా ఉన్నారంటే...?!
చైనాలో ఎక్కువమంది ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. ఆ దేశంలో చదువు, పనికి, ఇతర అవసరాలకు దాదాపు 69.8 శాతం ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వాడకం వల్ల వారెన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయినా సరే.. వారిలో 75 శాతం మంది తమ భవిష్యత్ కోసం ఎంతటి కష్టాన్నయినా.. ఇష్టంగా చేస్తామనే చెబుతున్నారు. ఇక ఆ దేశంలోని 73 శాతం యువ నెటిజన్లు కష్టపడి పనిచేయడం ఉపయోగకరమని అభిప్రాయపడగా.. 62.8 శాతం మంది కష్టపడితే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందొచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు.
'ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు.. చైనాపై కూడా పడుతున్నాయి. అయితే ఇతర దేశాల కంటే మెరుగైన అంశం.. మెచ్చుకోదగ్గది ఏమిటంటే.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేవిధంగా అక్కడి యువత చైతన్యవంతంగా ఉంది' అని అమెరికాకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు బ్లాకెన్‌షిప్ చెప్పారు. ఇక చైనా అధికారిక సమాచారం ప్రకారం... సివైఎల్‌సి 3.67 మిలియన్లకు పైగా విస్తరించి ఉంది. దాని అనుబంధ సంస్థల ద్వారా 73.71 మిలియన్ల సభ్యులు వున్నారు. వీరంతా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.














