Mar 09,2023 20:31

- సమావేశంలో మాట్లాడుతున్న విసి రంగ జనార్ధన్‌

కడప అర్బన్‌ : ఉన్నత విద్యలో వచ్చే విప్లవాత్మక మార్పులకు తట్టుకొని ప్రపంచ పోటీలో నిలబడేలా విద్యార్థులు అధ్యా పకులు శ్రమించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం విసి ఆచార్య రంగ జనార్ధన ఉద్బోధించారు. వైవీయూ 17వ వ్యవ స్థాపక, కళాశాల వేడుకల వేదిక డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం సెంట్రల్‌ లైబ్రరీ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మంచి వాతావరణం వనరులు ఉన్నాయి. ప్రణాళికలు అమలు చేసుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి అధ్యాపకుడు తాను ఎదుగుతూ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నించాలన్నారు. నాణ్యమైన పరిశోధన, బోధన, పరిపాలన వైవీయూలు లభిస్తోందని త్వరలోనే దేశంలోనే నెంబర్‌ వన్‌ విశ్వవిద్యాలయం గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్‌ విద్యాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆకర్షణీయమైన పాఠ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విదేశీ విద్యాలయాలు వస్తున్నాయి భవిష్యత్‌ పోటీని తట్టుకునేలా అధ్యాపకులు తయారు కావాలన్నారు. 17 ఏళ్లు పూర్తి చేసుకుని మైనర్‌ నుండి మేజర్‌కి వెళ్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయం అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్లైన్‌, ఆఫ్‌ లైన్‌, బ్లండెడ్‌ మోడ్‌ విధానాల్లో పాఠాలు బోధించాలని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకోవాలని సూచించారు. దూర విద్యా విధానం లో ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చామని దీన్ని ఎక్కువ శాతం మంది వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. స్పేస్‌ డిపార్ట్‌మెంట్‌ నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ డైరెక్టర్‌ డాక్టర్‌ అమిత్‌ కుమార్‌ పాత్ర మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ పోటీని తట్టుకునేలా జ్ఞాన సమపార్థన చేయాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఐఐటి, ఎన్‌ఐటి చదివే వారిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారని, సైన్స్‌ పట్ల విద్యార్థులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెలోషిపులు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.పి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు అత్యున్నత ఆశయంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్‌ ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం-2020 అమలులో వైవియు అన్ని విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. 39 మంది విద్యార్థులకు పీహెచ్డీలు అవార్డు చేయడంతో పాటు, ఎక్స్ట్రా మ్యూ రల్‌ రీసెర్చ్‌ (ఈఎమ్‌ఆర్‌) ద్వారా 23 మందికి పరిశోధనకు అవకాశం కల్పించామన్నారు. ముగ్గుల అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, వివిధ సంస్థల నుంచి మరికొంతమంది అధ్యాపకులకు అత్యున్నత అవార్డులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో డీన్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఫిమానిటీస్‌ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు సుబ్బారెడ్డి, ఎ.హరినారాయణ, వ్యాయామ విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎ.రామసుబ్బారెడ్డి డీన్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, స్కాలర్లు పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం సాంస్కతిక విభాగ సమన్వయకర్త ఆచార్య తప్పెట రాంప్రసాద్‌ రెడ్డి, థియేటర్‌ ఆర్ట్స్‌ ఆచార్యులు మూల మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.