వెనీస్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కొత్త వేరియంట్లు సవాల్ విసిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టాతో పాటు వస్తున్న లాంబ్డా, కప్పా వంటి కొత్త వేరియంట్లపై తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. ప్రపంచమంతా అనుసంధానమై ఉన్నందున ఏ మూల కరోనా విజఅంభించినా అది ఇతర దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. వెనీస్‌లో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. అభివఅద్ధి చెందుతున్న దేశాలు కరోనా వ్యాక్సిన్‌లు సమకూర్చుకునేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో నిధులు అందజేశాయని తెలిపారు. అయితే ప్రభావవంతమైన ఫలితాలకై కృషి చేయాల్సి వుందని అన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు అందజేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అలాగే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను అరికట్టే ఏర్పాట్ల కోసం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.










