Jun 01,2023 21:04

పురస్కారం అందజేస్తున్న మేడా, ఆకేపాటి

రాజంపేట అర్బన్‌ : వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులని, వారిలో సేవా గుణాన్ని మరింత పెంపొందించేందుకు, వారిని ప్రోత్సహించేందుకే పురస్కారాలు అందజేయడం జరుగుతోందని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు వాలంటీర్లకు, మండల పరిషత్‌ అభివద్ధి కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా సత్కారం చేశారు. వాలంటీర్లకు వారు చేసిన సేవలకు గాను సేవారత్న, సేవా మిత్ర అనే పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆకేపాటి, మేడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల ముంగిటకు చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులలోనూ వాలంటీర్లు బాధ్యతాయుతంగా సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు వాలంటరీ వ్యవస్థను కించపరిచారని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా నెలకొల్పిన సచివాలయ వ్యవస్థలో గ్రామ, వార్డు వాలంటీర్లదే కీలక పాత్ర అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, కమిషనర్‌ ఎం.జనార్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు, ఎంపిడిఒ బాలమునిస్వామి, పంచాయతీ కార్యదర్శులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.