ఒక అడవిలోని ఎలుగుబంటి పరోపకారి. అది తనకు ఏమి లభించినా కొంత తాను తీసుకుని మిగిలింది ఇతరులకు పంచి పెట్టేది. అన్నీ శాకాహార జంతువులు దానివల్ల సాయం పొందినవే. ఒకసారి అది అస్వస్థతకు గురై మూడు రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ఆహారం లేక పస్తులుంది. అప్పుడు నక్క ఒకటి దాని దగ్గరకు వచ్చి 'చూశావా! మిత్రమా! శాకాహార జంతువులకు పండ్లను, దుంపలను ఉచితంగా పంచి పెట్టావు. ఇప్పుడు నీకు ఎవరూ ఆహారాన్ని తెచ్చి ఇవ్వడం లేదు. అందరూ నీ చేత సాయం పొందిన వారే. నాకేమో చెట్టెక్కడం రాదు. అందువల్ల నీకు ఆహారం తీసుకురాలేను. నీవేమో శాకాహారివైతివి. నేనేం చేయాలి? నిన్ను చూస్తే జాలేస్తుంది' అంది.
ఆ మాటలు విన్న ఎలుగుబంటి 'ఛీ! ఛీ! అవేం మాటలు? నేను వాటి నుంచి ప్రతిఫలం ఆశించి పండ్లు, దుంపలను పంచి పెట్టలేదు. నేను జబ్బు పడ్డానన్న సంగతి వాటికి తెలిసినట్టుగా లేదు. ఇందులో వాటి తప్పేముంది' అంది. ఆ మాటలు విన్న నక్క తన మూతిని వంకరగా తిప్పి 'అయ్యో! నీకు ఇంకా వాటి నిజస్వరూపం తెలియడం లేదు. నీవు మూడు రోజులుగా కనబడకుంటే చూడటానికి ఇంటికి రావచ్చు కదా!' అని అంది. అప్పుడే అనుకోకుండా కోతి, కుందేలు మామిడి పండ్లను పట్టుకుని వచ్చాయి. వాటిని చూసి నక్క కంగుతింది. అవి రెండూ ఎలుగుబంటితో 'మామా! నీవు జబ్బు పడిన సంగతి మాకు తెలియనే తెలియదు. ఈ నక్క మాకు మూడు రోజులుగా కనిపిస్తుంది. కనీసం ఈ విషయం మాకు చెప్పనేలేదు. నీవు కనబడలేదన్న బెంగతో ఇక్కడకు వచ్చాము. దారిలో వచ్చేటప్పుడు మామిడి చెట్లకు కొన్ని పండ్లు కనిపిస్తే తీసుకుని వచ్చాం. నీ కష్టం మా అందరిది కాదా! నీకు ఆరోగ్యం బాగాలేదని, ఆహారంలేక ఇబ్బంది పడుతున్నావని ఇతర జంతువులతో కబురు చేయవద్దా! మేం నీకు పరాయి వారిమయ్యామా? ఇలాంటి సమయంలో నీకు అండగా ఉండకపోతే మన స్నేహానికి అర్థమేముంది?' అని తెచ్చిన పండ్లు ఇచ్చి, మరలా రేపు వస్తాం అని ధైర్యం చెప్పి వెళ్లాయి.
'నక్కబావా! నీవు మొదట వీటి గురించి ఏమేమో మాట్లాడావు. ఇప్పుడు తెలిసిందా! నేను కనబడలేదనే బెంగతోనే అవి ఇక్కడికి వచ్చాయి. మరి నీవో! నేను జబ్బు పడినానని తెలిసినా వాటికి చెప్పలేదు. ఇకనైనా నీ బుద్దిని మార్చుకో! లేకుంటే నీవు జబ్బు పడితే నిన్ను ఎవరూ ఆదుకోరు. తెలిసిందా! మంచివారికి ఇతరులు సహాయపడతారు. ఇకనైనా ఇతరులకు ఉపకారం చేస్తూ జీవించు' అని అంది. అంతలోనే పెద్ద బండరాయి కొండపై నుంచి దొర్లి అతివేగంగా వచ్చి నక్క మీద పడబోయింది. అంతే ఎలుగు చాకచక్యంతో నక్కను కాపాడింది. ఊహించని ఆ సంఘటనకు నక్క ఆశ్చర్యపోయింది. నక్క మనస్సు మార్చుకుంది. ఎలుగు చేసిన సాయానికి కృతజ్ఞత చెబుతూ ఇకపై 'నేనూ ఇతరులకు సాయం చేస్తా' అని నక్కకు మాట ఇచ్చింది. అందుకే అంటారు మంచి మిత్రులతో స్నేహం చేస్తే మనకూ మంచి గుణాలు అలవడుతాయని.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 99085 54535