Jan 28,2022 20:56

 కొత్త వాస్తవికతను అంగీకరించాలి
 ఇందుకనుగుణంగా వేగంగా మారాలి
 కోవిడ్‌-19 సవాళ్లు అస్తిత్వ ముప్పుగా మారొచ్చు : తాజా నివేదిక

న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలోని విద్యావ్యవస్థ పరిస్థితి అంతకంతకూ దిగజారి పోతున్నది. దేశంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా భారత్‌ కంటే చిన్న దేశాలూ విద్య విషయంలో ముందుంటే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేయడం, మతం వంటి అంశాల్లో మునిగి తేలుతూ యువత, దేశ ప్రజల మెదళ్లను కలుషితం చేస్తున్నదని ఆరోపించారు. దేశంలోని విశ్వవిద్యాలయాల పనితీరు ఆశించినంతగా లేదని ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. అయినప్పటికీ మోడీ సర్కారు తీరులో మాత్రం ఎలాంటి చలనమూ రాలేదని విద్యా నిపుణులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇలాంటి నివేదికే ఒకటి ఇటీవల విడుదలైంది. దేశంలోని విశ్వ విద్యాలయాలు ప్రమాదంలో ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. ఉన్నత విద్యారంగం భవిష్యత్తు విశ్లేషణ ఆధారంగా 'గతంలో ఉన్న విశ్వ విద్యాలయాలు ఇప్పటికీ భవిష్యత్తును కలిగి ఉన్నాయా?' అనే శీర్షికతో ఒక సంస్థ ఈ నివేదికను ప్రచురించింది. ఇది భారత్‌తో పాటు యూఎస్‌, యూకే, సింగపూర్‌, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయ కార్యదర్శులతో 29 ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు.
కోవిడ్‌ా19 మహమ్మారి కారణంగా దేశంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితి ప్రమాదంలో పడిపోయిందని సదరు నివేదిక పేర్కొన్నది. కరోనా కారణంగా దూర విద్య కార్యకలాపాలలో తాత్కాలిక పెరుగుదల ఉన్నత విద్యా రంగంలో వేగవంతమైన మార్పునకు నాంది మాత్రమేననీ వివరించింది. అయితే, విద్యాసంస్థలను తిరిగి తెరచిన తర్వాత కూడా సాధారణ స్థితికి చేరుకోదని అంచనా వేసింది. మహమ్మారి కారణంగా, అభివృద్ధి చెందిన ఆర్థిక దేశాలలోని విశ్వ విద్యాలయాల ముందుకు అనేక విషయాలు వస్తున్నాయనీ, ఇలాంటి పరిస్థితులలో విశ్వవిద్యాలయాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నది.
జనాభా మార్పులు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, మారుతున్న డిమాండ్లు, నాణ్యమైన డిజిటల్‌ అనుభవం కోసం విద్యార్థుల ఆకాంక్షల నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు కొత్త వాస్తవికతకు అనుగుణంగా వేగంగా మారాలని నివేదిక నిర్ధారించింది. '' ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ ప్రపంచ మహమ్మారితో పోరాడుతున్నాయి. తాత్కాలిక దూర విద్యవైపు వేగవంతమైన మార్పు ఈ రంగంలో వేగవంతమైన పరివర్తనకు నాంది మాత్రమే. క్యాంపస్‌లు పున:ప్రారంభమైన తర్వాత కూడా , అవి సాధారణ స్థితికి రాలేవని అంగీకరించాలి'' అని నివేదిక పేర్కొన్నది. కోవిడ్‌-19 మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు త్వరలో అస్తిత్వ ముప్పుగా మారవచ్చని హెచ్చరించింది. విశ్వవిద్యాలయాలు గతంతో భవిష్యత్తును చూసే వైఖరిని అవలంభించాలని నివేదిక సిఫారసు చేసింది.