రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటల యుద్ధం భౌతిక దాడుల స్థాయికి చేరుకోవడం బాధాకరం. ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయ విధ్వంసం దారుణం. ఇటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల కీలకమైన ప్రజాసమస్యలు పక్కదోవ పట్టడమే కాక, రాష్ట్రాభివృద్ధికి హాని కలుగుతుంది. రాజకీయాలన్న తరువాత విమర్శలు, ప్రతి విమర్శలు సహజం! పాలకపక్షం మొండిగా వ్యవహరించినప్పుడు విపక్షం కొంత కటువుగా కూడా స్పందించవచ్చు. అయితే వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దూరంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగే ఈ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడానికి దోహదపడాలి. విమర్శ విషయ పరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణకు పాల్పడరాదు. రాజకీయ హుందాతనం ఎంతైనా అవసరం. కానీ, మన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నది అది కాదు. నువ్వొకటంటే, నేను రెండు అంటా అన్నట్టుగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి తయారైంది. ఇది మరింతగా ముదిరి భౌతిక దాడులకు దారి తీసింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు యంత్రాంగం పాత్ర వివాదాస్పదంగా మారుతోంది.
డిజిపి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి జరుగుతున్నా దాన్ని నివారించడానికి పోలీస్ యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒక్క మంగళగిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లోనూ టిడిపి కార్యాలయాలు, నాయకుల ఇళ్లు లక్ష్యంగా మంగళవారం నాడు అధికార పార్టీ అనుయాయులు ఆగడాలకు పాల్పడ్డారు. ఒకేరోజు, దాదాపుగా ఒకే సమయంలో జరిగినవన్నీ యాదృచ్ఛికమనో, మరొకటనో చెప్పలేం! ఈ తరహా చర్యలను అడ్డుకుని, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీస్ యంత్రాంగానిదే. ఆ పనిని పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి. అలా చేయలేకపోవడంతో వరుసగా రెండవ రోజు కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టిడిపి, వైసిపిలు పోటీపడి నిరసన కార్యక్రమాలకు పిలుపులిస్తుండటంతో ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో! ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఈ తరహా ధోరణులకు రెండు పార్టీలు తక్షణం స్వస్తి పలకాలి.
శాంతి భద్రతలు క్షీణించాయని, 356వ అధికరణాన్ని ప్రయోగించి, రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరడం సమర్ధనీయం కాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి రామారావు ప్రభుత్వాన్ని అప్పటి కేంద్ర కాంగ్రెస్ సర్కారు ఇదే అధికరణాన్ని ప్రయోగించి రద్దు చేసింది. అప్పట్లో ప్రజాగ్రహం వ్యక్తమైన తీరు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. చంద్రబాబు నాయుడి కుమారుడు, మాజీమంత్రి లోకేష్ ఎమర్జన్సీ విధించాలంటూ చేసిన డిమాండ్ కూడా అటువంటిందే! చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించాలని, శాంతి భద్రతలను చక్కదిద్దాలని, దాడులు చేసిన వారిని, అందుకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేయవచ్చు. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రసాదించిన హక్కులను హరిస్తూ, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ సర్కారుకు అటువంటి అవకాశం అసలు ఇవ్వరాదు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో, రాష్ట్రాల హక్కుల కోసం ప్రయత్నించిన పార్టీ నాయకుల నుండి ఇలాంటి డిమాండ్లను ఎవరూ ఊహించలేరు. ఇప్పటికైనా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయమనం పాటించాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఆటంకంగా మారిన కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని నిలదీసి హక్కులను సాధించుకోవడానికి ప్రజల తరపున గళం విప్పాలి. దానికి భిన్నంగా ఇలాంటి వివాదాల్లో కూరుకుపోయి వ్యక్తిగత విమర్శలు, దాడులతో విలువైన కాలాన్ని హరించడం రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేయడమే!










