ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో మంచిదని, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ జి.ఎల్.శివజ్యోతి అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి మించింది లేదని, ప్రస్తుతం రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని. దీంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకు పోయారన్నారు. అటువంటి పరిస్థితుల నుండి రైతు మామూలు స్థితికి రావాలంటే గోఆధారిత వ్యవసాయమే చేయాలన్నారు. మూడేళ్ల పాటు కష్టపడితే తర్వాత ప్రకతి వ్యవసాయానికి భూమి అలవాటుపడి పెట్టుబడులు, ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ ఎరువులు, బీజామతం వంటి విత్తన శుద్ధి రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకోవాలని, ప్రకృతి వ్యవసాయంలో కేవలం దేశీ విత్తనాలనే విత్తుకొని సొంత విత్తన భాండాగారాలను ఏ ర్పాటు చేసుకోవాలని కోరారు. సదస్సుకు వచ్చిన రైతులకు ప్లాస్టిక్ డ్రమ్ములు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపిఎం మాలకొండయ్య, ఎడిపిఎం రవిచంద్రప్రసాద్, ఐటిడిఎ అనురాధ, పంటల ఉత్పత్తి విభాగం శాస్త్రావేత్త కిరంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.










