ఇకె నయనార్ నగర్ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : ''ఎన్నికలకు ముందు బిజెపి ప్రజలను చీల్చింది. మోసపూరిత వాగ్దానాలను ఇచ్చింది. వారిని భ్రమల్లో ఉంచింది. నాలుగేళ్ల బిజెపి పాలన తరువాత త్రిపుర ప్రజానీకం వాస్తవాలను తెలుసుకుంటున్నారు. అభివృద్ధికి బదులు హింసా సంద్రంలో మునిగిపోయామని వారు గుర్తించారు. తమ హక్కుల కోసం రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి అండగా సిపిఎం నిలుస్తోంది అని త్రిపుర రాష్ట్ర సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపి నారాయణ్ ఖేర్ అన్నారు. సిపిఎం 23వ మహాసభలకు ప్రతినిధిగా వచ్చిన ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు క్లుప్తంగా :
- త్రిపురలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?
త్రిపురలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగాన్ని అక్కడ అమలు చేయడం లేదు. ప్రజలు వాక్ స్వాతంత్రంతో పాటు జీవించే హక్కునూ కోల్పోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బిజెపి ముసుగులో గూండాలు రెచ్చిపోతున్నారు. ఈ కాలంలోనే 47 సిపిఎం కార్యాలయాలను ధ్వంసం చేశారు. వందలాది మంది సిపిఎం కార్యకర్తలపై దాడులు చేశారు. నాలుగేళ్ల క్రితం అంటే 2018 మార్చి 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి ఈ హింసాకాండ ప్రారంభమైంది. అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. నాలుగేళ్లలో 22 మంది పార్టీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. ఒక్క నిందితుడిని కూడా పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. 302 సెక్షన్ కింద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొన్ని సంఘటనల్లో అసలు కేసులే పెట్టలేదు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ దమనకాండ జరుగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అందుకే మేం దీన్ని ఫాసిస్టు హింస అంటున్నాం.
- ఇతర పార్టీలపై కూడా దాడులు జరుగుతున్నాయా?
అవును. ప్రశ్నించే ప్రతి గొంతునూ బిజెపి లక్ష్యంగా చేసుకుంటోంది. అటువంటి వారిని గుర్తించడానికి వారికో యంత్రాంగం ఉంది. గుర్తించిన తరువాత లోబరచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. సామ దాన భేద దండో పాయాల్లో అన్నిటిని వాడుతున్నారు. లంగకపోతే హత్యలకు తెగిస్తున్నారు. కొన్ని సమయాల్లో పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయి. వారి లక్ష్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినపడకూడదనే! మీడియా సంస్థలను కూడా నియంత్రించారు. దేశర్ కథపై తీవ్రమైన దాడికి దిగారు. కోర్టు ఉత్తర్వులతో పత్రికను నిర్వహిస్తుంటే పంపిణీని అడ్డుకున్నారు. ఎవరైనా పత్రికను పంపిణీ చేస్తే సిపిఎం నాయకులకు పట్టిన గతే పట్టిస్తామని హెచ్చరించారు. మరో ఒకటి, రెండు పత్రికలకు కూడా ఇలాంటి హెచ్చరికలే అందాయి.
- బిజెపి ఈ స్థాయికి ఒక్కసారిగా ఎలా ఎదిగింది?
2018కి ముందు రాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి ఒక్క సీటు కూడా లేదు. కానీ, అంతకు చాలా ముందునుంచీ గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ వివిధ పేర్లతో అనేక కార్యక్రమాలు నిర్వహించేది. ప్రజల్లో విభజన బీజాలు వేసింది. 2018లో ప్రజలను భ్రమల్లో ముంచే వ్యూహానికి తెరతీసింది. ఎన్నికల సంవత్సరానికి చాలా ముందే ప్రస్తుత ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్‌తో పాటు పలువురిని రాష్ట్రానికి పంపింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను దాదాపు స్వాహా చేసింది. ఒకరిద్దరు తప్ప ఆ పార్టీ కీలక నాయకులంతా బిజెపిలో చేరారు.
ప్రధాని హౌదాలో మోడీ అనేక దఫాలు రాష్ట్రంలో పర్యటించారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో 220 హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 50 వేలకుపైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించడం, సామాజిక ఫించన్ల మొత్తాన్ని రూ.2000లకు పెంచటం, ఉపాధి హామీ కూలిని రోజుకు రూ.340లకు పెంచడంతో పాటు, 200 రోజులు పని కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వంటి మోడీ నినాదాలతో ప్రజలు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ ఓట్లు దాదాపుగా బిజెపికి బదిలీ అయ్యాయి. సాంప్రదాయ సిపిఎం ఓటర్లు కొందరు అటువైపే మొగ్గు చూపారు.
- ఈ హామీల్లో ఎన్ని అమలు చేశారు?
హామీలు అమలు చేయడం అటుంచి, వామపక్ష ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూడా బిజెపి తొలగించింది. ప్రశ్నించిన వారిని లక్ష్యం చేసుకుంది. ఈ కారణంగానే స్థానిక ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలను కూడా నిర్వహించడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రతిసారి కోర్టు జోక్యం చేసుకోవాల్సివచ్చింది.
- ప్రజలు దీనినిఎప్పుడు గుర్తించారు?
ప్రజలందరూ గుర్తించారని చెప్పలేం. అయితే, ఆ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తే సిపిఎం శ్రేణులు కదలి సేవలందించడాన్ని ప్రజలు చూశారు. ఎంతో మందిని మృత్యు ముఖం నుంచి కాపాడటం వారి ప్రశంసలకు కారణమైంది. పెరిగిన ధరలు, ఉద్యోగాలు రాకపోవడం, యువత వలస వెళ్లాల్సి రావడం, సామాజిక ఫించన్లలో కోత వంటి చర్యలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి. వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అగర్తలలో నాలుగైదు భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
- సిపిఎంగా ఏం చేయబోతున్నారు?
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర అత్యంత సున్నిత ప్రాంతం. అసోంతో తప్ప భారత్‌తో ఏ ప్రాంతంతోనూ మాకు రోడ్డు సంబంధాలు లేవు. అనేక ఏళ్ల పాటు తీవ్రవాదం ఇక్కడ ప్రబలింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలి. నాలుగేళ్లపాటు దాడులను తట్టుకుని సిపిఎం నిలిచింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే గొంతులను మేం మరింత బలపరుస్తాం. వారిని చైతన్యవంతులను చేస్తాం. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న అంశాన్ని మేం నమ్ముతాం.










