Jun 10,2023 21:36

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రమేష్‌ కుమార్‌ రెడ్డి

 రాయచోటి : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో రాష్ట్రంలోని రైతులతో పాటు ప్రజలు తీవ్ర విద్యుత్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బోస్‌ నగర్‌ లోని టిడిపి నూతన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016 సంవత్సరం నాటికి గుజరాత్‌ తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 100 శాతం విద్యుత్‌ సరఫరా చేసిన రాష్ట్రంగా ఎంపి నిలిచిందన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 38 లక్షల కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తే వైసిపి కేవలం 8 లక్షల కనెక్షన్లతో సరిపెట్టిందన్నారు. 2014 సంవత్సరంలో 9529 ఉన్న ఇన్‌స్టాల్‌ కెపాసిటీని 24,184 పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. టిడిపి హయాంలో ఒక్క రూపాయి విద్యుత్తు ఛార్జీలు పెంచలేదని, సైకో జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపాలని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హాయంలో 50 యూనిట్లకు వరకు యూనిట్‌కు 1.45 ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 యూనిట్లకు రూ. 3 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో ప్రభుత్వం రూ. 369 కోట్ల భారాన్ని 1,47 వేల కోట్ల కుటుంబాలపై 14.65 వాణిజ్య, 1.63 లక్షల హర్ష విద్యుత్‌ కనెక్షన్లను మోపిందన్నారు. అంతేగాక అదనపు లోడ్‌ ఛార్జీ పేరుతో వినియోగదారులపై రూ.2000 నుండి రూ.5000 వరకు భారాన్ని మోపుతూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కస్టమర్‌ చార్జీల పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి నెలకు 30 దోచుకుంటుందని, ఇది రైతు వ్యతిరేక చర్య అన్నారు .కేంద్రం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే జగన్‌ రెడ్డి మాత్రం తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం నిర్ణయాలకు వంతపాడుతున్నారని విమర్శించారు. డిస్కంలో సగటు విద్యుత్‌ ధర యూనిట్‌ కు రూ.4.75 లు ఉండగా జగన్‌ ప్రభుత్వం మాత్రం బహిరంగ మార్కెట్లరూ.8.77 వెచ్చించి విద్యుత్‌ కొనుగోలు చేసిందన్నారు. దీంతో 2019 నుండి 2022 వరకు ఏడాదికి గాను రూ. 600 కోట్లు భారం ప్రజలపై పడిందన్నారు. టిడిపి ప్రభుత్వంలో 2015 నుండి 19 వరకు రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాల కోసం రూ.20,246 కోట్లు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం 2019 నుండి 2023 మధ్యకాలంలో ప్రజల నుండి భారీ మొత్తంలో విద్యుత్‌ టారీఫ్‌ లు, జరిమానాలు వసూలు చేసినప్పటికీ కూడా కేవలం రూ.25.367 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అసమర్థత కారణంగా విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమలు వదిలి వెళ్ళిపోతున్నాయని ఆరోపించారు .రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాష, లక్కిరెడ్డిపల్లి మండల టిడిపి అధ్యక్షులు జయరాం, సంబేపల్లి మండల నాయకులు మల్లు విష్ణువర్ధన్‌ రెడ్డి, కంకర , నరసింహారెడ్డి పాల్గొన్నారు.