ప్రజలకు వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం
- డాక్టర్ బింధు మీనన్ వెల్లడి
ప్రజాశక్తి-అల్లూరు : గ్రామాలలో ప్రజలకు విస్తతంగా వైద్య సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యమని ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. బిందు మీనన్ వెల్లడించారు. ఆదివారం మండలంలోని ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బిందు మీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరాలజీ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 2013 నుండి ఇప్పటివరకు సుమారు 200 ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నట్లు వివరించారు. బిపి, సుగర్, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, పార్శ నొప్పికి వైద్య పరీక్షల నిమిత్తం అవసరం మేరకు మందులు వాడాలని తెలియజేశారు. అలాగే కొన్ని అలవాట్లను దూరం చేసుకుంటే ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ గ్రామంలో ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిపి దర్శగుంట శశిరేఖ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలసిన పరికరాలు అందజేస్తున్నారని వివరించారు. అలాగే ఈ గ్రామవాసి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు కృషితో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలియబరిచారు. న్యూరాలజిస్ట్ బిందుమీనన్ ఇక్కడికి విచ్చేసి వైద్య సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రక్త కణాల పరీక్ష యంత్రాన్ని ఏర్పాటు చేసి చేసి ఉన్నట్లు ప్రజలకు తెలియబరిచారు. అనంతరం ఆమెను ఘనంగా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈ మెడికల్ క్యాంపులో సుమారు 110కి పైగా వైద్య సేవలు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్ కుమార్, దర్శి గుంట వెంకయ్య, దళవాయి మునిరాజా, బీద మహిధర్, సూపర్‌వైజర్ పందల కృష్ణయ్య తదితరులున్నారు.










