Dec 02,2022 22:13

అధికారులతో మాట్లాడుతున్న సర్పంచులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : తమ గ్రామ పంచాయతీలలో ప్రజలకు తమ ముఖాలను చూపించలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికమండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. 14 ,15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ కాకపోగా వచ్చిన అరకొర నిధులను కూడా అధికారులు విద్యుత్‌ బకాయిలకు, క్లాప్‌ మిత్ర వేతనాలకు జమ చేయడం అన్యాయమన్నారు. దీంతో పంచాయతీలలో వీధి బల్బులు, మోటార్‌ రిపేర్లు తదితర సమస్యలు తీర్చలేక పోతున్నామని వాపోయారు. దీంతో పంచాయతీ ప్రజలకు తమ ముఖం చూపులేకపోతున్నామన్నారు. గత మూడు సమావేశలలో చర్చించిన ప్రజా సమస్యలు అధికారులు పరిష్కారం చేయలేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలు సర్పంచులైన తమకే తెలియటం లేదని ఇంక గ్రామాల్లోని ప్రజలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సమావేశాలకు టీ, కాఫీ, బిస్కెట్‌ తినటానికి వస్తున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సర్పంచులు పోడియం ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశాన్ని బారుకాట్‌ చేసి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ మురళీకృష్ణ, వైస్‌ ఎంపీపీ రత్నమ్మ నారాయణ, ఎంపీటీసీలు పూజారి ఈశ్వరయ్య, నాగప్ప, నందిని, రాజేశ్వరి, సర్పంచులు గంగాదేవి, కిష్టప్ప, సోమశేఖర్‌, పరంధామ, రామాంజనేయులు, అంజి నాయక్‌, గిరిజమ్మ, నిర్మలమ్మతో పాటు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.