May 10,2023 20:55

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీల పరిష్కార విధానంలో మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో 'జగనన్నకు చెబుదాం' అనే కార్యక్రమంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి గంగాధరరావుతో కలిసి కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమ ప్రధాన లక్ష్యయన్నారు. 1902కి వచ్చే ఫిర్యాదుల విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. అర్జీల ద్వారా పరిష్కారానికి సాధ్యం కాని సమస్యలను 1902 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేసి వేగవంతమైన, నాణ్యమైన పరిష్కారాన్ని పొందవచ్చన్నారు. ప్రత్యేకంగా నియమించిన సీనియర్‌ లెవెల్‌ ఐఎఎస్‌ అధికారులు నెలకు రెండు పర్యాయాలు జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు విధానం ద్వారా నాణ్యమైన, సంతప్తికరమైన, పారదర్శకమైన పరిష్కారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్పందన గ్రీవిన్స్‌ కార్యక్రమం కంటే బెటర్‌గా అర్జీల పరిష్కారం అందుతుందన్నారు. 1902 కాల్స్‌ స్వీకరణ, ఐవిఆర్‌ఎస్‌ ఎస్‌ఎంఎస్‌. సందేశంతో మల్టిబుల్‌, ఫీడ్‌ బ్యాక్‌, అప్‌డేట్‌ సమాచారం ఎప్పటికప్పుడు హెల్ప్‌ డెస్క్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి అందుతుందని పేర్కొన్నారు. ఫోన్‌ కాల్స్‌ ద్వారా అందిన ఫిర్యాదులను ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో సిఎంఒ స్థాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలోని ఆయా శాఖల విభాగాల వరకు సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో పరిష్కారాలను చూపడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ ఆడిట్‌ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ, రాయచోటి ఆర్‌డిఒ, రాయచోటి ఇఒపిఆర్‌డి, రాయచోటి డిప్యూటీ తహశీల్దార్‌ (సివిల్‌ సప్లై), రాయచోటి ఏరియా ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ టీమ్‌ ద్వారా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిశీలించి, విశ్లేషణ చేయడంతో పాటు 15 రోజులకు ఒకసారి సంబంధిత నివేదికలను కలెక్టర్‌, ఎస్‌పిలకు అందిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం ఎంత మేర జరుగుతుందనేది స్పష్టం అవుతుందన్నారు. ఒకవేళ పరిష్కారం కాకుండానే ఫిర్యాదులను అధికారులు క్లోజ్‌ చేసినట్లయితే సంబందిత ఫైల్‌ను పైస్థాయి అధికారి తిరిగి ఓపెన్‌ చేసే రైట్స్‌ టీమ్‌కు ఉంటుందన్నారు. మంగళవారం జగనన్న చెబుదాం కార్యక్రమానికి 42 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. స్పందన ఫిర్యాదుల కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 15,806 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి భరత్‌ కుమార్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఎఒ బాలకృష్ణ పాల్గొన్నారు.