ధర్మవరం టౌన్ : సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు సిబ్బంది, వాలంటీర్లు కృషి చేయాలని కలెక్టర్ బసంత్‌కుమార్ సూచించారు. మంగళవారం నాడు ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని ఎల్‌సికె పురం, పార్థసారథి నగర్-1, పార్థసారధి నగర్-2 వార్డు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహశీల్దార్ యోగేశ్వరీదేవితో కలిసి తనిఖీ చేశారు. సచివాలయాలలో ఏర్పాటు చేసిన సేవలకు సంబంధించి బోర్డులను పరిశీలించారు. సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ ఖచ్ఛితంగా పాటించాలని తెలిపారు. సాయంత్రం వరకు సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. స్పందన వినతులు స్వీకరించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వార్డు సచివాలయాల్లో వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన అర్హులైన జాబితాతో పాటు అనర్హులైన లబ్ధి పొందని జాబితాను ఖచ్ఛితంగా ప్రదర్శించాలని తెలిపారు. ప్రతి వార్డు వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆయా వార్డ్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో సేవలు 150 రకాల సేవలు అందించాలని తెలిపారు. వివిధ వార్డుల్లో ఉన్న సంక్షేమ అసిస్టెంట్లు, మహిళ పోలీసులు ఖచ్ఛితంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీలు చేయాలన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయంలో కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గహ నిర్మాణ పనులలో పురోగతి సాధించాలని ఇంజినీర్ అసిస్టెంట్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు మేడాపురం వెంకటేష్, రాయపాటి రామకష్ణ, గోరకాటి పురుషోత్తం రెడ్డి, హౌసింగ్ ఈఈ మునీశ్వర నాయుడు, సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.










