Dec 20,2022 22:37

ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

అమడగూరు : సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం అమడగూరు మండలంలోని కస్సముద్రం, అమడగూరు, గుండువారిపల్లి, తుమ్మల గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చూడాలన్నారు. ఆయా సచివాలయాలకు వస్తున్న సర్వీసులను మరిన్ని పెంచాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగాకలెక్టర్‌ ఆయా సచివాలయాల్లో రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం తుమ్మల గ్రామ సచివాలయంలో ఈనెల 24వతేదీన డెలివరీ డేట్‌ ఇచ్చిన హైరిస్క్‌ గర్భిణి అరుణతో కలెక్టర్‌ మాట్లాడారు. అనంతరం మలకవారిపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని సూచించారు. హైరిస్క్‌ గర్భిణులను 2, 3 రోజుల ముందుగానే ఏరియా ఆసుపత్రులకుగానీ, జిజిహెచ్‌కి గానీ రిఫర్‌ చేసి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రెడ్డి శేఖర్‌, ఇఒఆర్‌డి నసీమా, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అపర్ణ, సిహెచ్‌ఒ ఫక్రుద్దీన్‌, ఎంపిహెచ్‌ఎస్‌ సూపర్వైజర్‌ మేరీ, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ రెడ్డెమ్మ, ఎఎన్‌ఎం అనిత కుమారి, ఆశాలు శంకరేశ్వరి, మహిత, గంగులమ్మ, సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృ మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఆదేశించారు. మాతృ మరణాల నివారణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రిలోని లేబర్‌ వార్డులో ప్రసవానికి అడ్మిట్‌ అయిన ఈడిడిలు (ఎక్స్పెక్టెడ్‌ డేట్‌ ఆఫ్‌ డెలివరీస్‌), హైరిస్క్‌, సాధారణ కేసుల గురించి జిల్లా కలెక్టర్‌ ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో నాడు- నేడు కింద చేపట్టిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఆతరువాత డయాలసిస్‌ వార్డును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హుస్సేన్‌, కదిరి డివిజన్‌ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ ఐనుద్దీన్‌ఖాన్‌, గైనకాలజిస్ట్‌ ప్రత్యూష, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.