సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
నెల్లూరు:సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించడంతో పాటు వివిధ సమస్యలపై వస్తున్న ధరఖాస్తులను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నగర కార్పొరేషన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలోని 54/4 సచివాలయాన్ని, జనార్ధన్ రెడ్డి కాలనీలోని 54/3 సచివాలయాన్ని కార్పోరేషన్ కమిషనర్ హరితతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, వచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో వున్నాయి అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, మరిన్ని సర్వీసులు పెంచేలా చూడాలన్నారు. సచివాలయాలకు వస్తున్న ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచరాదన్నారు. సచివాలయ పరిధిలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఈ శ్రమ, ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పరిధిలో ప్రజలకు ప్రాధమిక వైద్య సేవలు సకాలంలో అందేలా కషి చేయాలని హెల్త్ ఆసిస్టెంట్లను ఆదేశించారు. కార్యక్రమంలో నగర తహశీల్ధార్ నిర్మలానంద బాబు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










