ప్రజల సంక్షేమమే సిఎం కృషి
ప్రజాశక్తి-ఆత్మకూర్ అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ లబ్ధి కరపత్రాలను అందచేసి ప్రభుత్వం వారి కుటుంబానికి అందచేసిన సంక్షేమ పధకాలను లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో తాను ఇప్పటి వరకు 42 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించామని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తన లాంటి వారికి ఇది మంచి వేదికలా నిలిచిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికీ వివరించేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ఇళ్ల వద్ద ఉండే సమయంలోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు సెల్ఫీ ఛాలెంజ్‌లు గురించి చెబుతున్నారని, అర్బన్ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని, ప్రజలు మాట్లాడుతున్న ప్రలోభ మాటలు పెడుతున్నారని, వారందరూ తమతో కలసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అర్బన్ ప్రాంతాల్లో పర్యటిస్తే వైసిపికి ప్రజల నుంచి లభించే ఆదరణ వారికి కూడా తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దీని వల్లే దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 74 శాతం మేర చేరుతున్నారని తెలిపారు. ఇలాంటి పాలన అందచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జగనన్న వెంటే నడుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, మాజీ జెడ్‌పిటిసి డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, వార్డు కౌన్సిలర్ కోడూరు కౌసల్యమ్మ, పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.










