Apr 08,2023 21:23

ఫొటో : ఆసరా చెక్కును అందజేస్తున్న మంత్రి కాకాణి, రాజ్యసభసభ్యులు బీద, ఎంఎల్‌ఎ రామిరెడ్డి

ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం
- వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి
ప్రజాశక్తి-కావలి : ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కరోనా వంటి విపత్కర పరిస్థితులు చవిచూసినా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడా రాజీపడకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వ హించిన ''వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత'' రుణమాఫీ నిధులు పంపిణీ సంబరాల్లో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు, ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డితో కలిసి మంత్రి కాకాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు మహిళలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వయం సహాయక మహిళలు వారు ఉపాధి పొందుతున్న పనిముట్లతో ఏర్పాటుచేసిన స్టాళ్లను ప్రజా ప్రతినిధులు పరిశీలించి, వాటి పనితీరు, పొందుతున్న లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి పథకాన్ని కూడా మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారాల ద్వారా రాణించి ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ వడ్డీకే సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తుందన్నారు. మహిళలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పేదరికం వల్లఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తే, వారు ఆర్థిక స్వావలంభన సాధించి సంతోషంగా జీవిస్తారనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వాహన మిత్ర, ఈబీసీ నేస్తం వంటి అనేక పథకాలను విజయ వంతంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రతి పథకాన్ని కూడా ఇంటి వద్దకే నేరుగా డోర్‌డెలివరీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని కొనియాడారు. రాష్ట్రంలోని మహిళలను సొంత అక్కాచెల్లెళ్లుగా భావిస్తూ పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు స్వయం సహాయక సభ్యులకు ఆసరా 3వ విడత నిధులను సిఎం విడుదల చేస్తున్నారన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నేరుగా మహిళల ఖాతాల్లోనే ఈ నగదును జమ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.19200 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేస్తుండగా, మూడో విడతలో జిల్లాలోని 34,440 గ్రూపులకు రూ.826 కోట్లు మంజూరు చేసామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్న తరహా జీవనోపాధులు ఎంచుకుని ఆర్థిక సుస్థిరత సాధించాలని మంత్రి మహిళలకు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, కరోనా వంటి పరిస్థితుల్లో ఈ పథకాలు ప్రజలకు భరోసానిచ్చాయన్నారు. కావలిని కనక పట్టణంగా అభివృద్ధి చేసేందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రిని ప్రతిఒక్కరూ మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఇచ్చిన మాట కట్టుబడి అని హామీలు అమలు చేశారని, వైయస్సార్‌ ఆసరా మూడో విడత కింద ఒక కావలి పట్టణానికే సుమారు రూ.8 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశారనిత తెలిపారు. తొలుత బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పొదుపు మహిళల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, కావలికి సంబంధించిన 1148 సంఘాల్లోని 10529 మంది సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా 3వ విడత మొత్తం 8 కోట్ల 67 లక్షల 63 వేల రూపాయల చెక్కును మహిళలకు అందచేశారు. కార్యక్రమంలో మెప్మా పిడి డి.రవీంద్ర, ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌, ఎఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌ యాదవ్‌, ప్రజా ప్రతినిధులు, మెప్మా ఐ.బి.అంకయ్య, బ్యాంకు లింకేజీ. సురేంద్ర, కొండయ్య, ఆర్‌.పి.సి.ఎం.ఎం. భారతి, మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల్లోని మహిళలు పాల్గొన్నారు.