పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ప్రజల పక్షాన పోరాడే ఉద్యమ నేపథ్యం కలిగిన అభ్యర్థులను గెలిపించుకోవలసిన అవసరం విద్యావంతులైన పట్టభద్రులకు ఉందని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎస్ రద్దు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సమస్యలను ప్రభుత్వంతో పోరాడి సాధించ కలిగే అభ్యర్థులను గెలిపించుకోవాలని పేర్కొన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్, 198కి పైగా ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజాసంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నానని ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా ఉందని రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, లౌకికవాద స్ఫూర్తిని మంటగల్పుతున్నారన్నారు. విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారని చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. రాయలసీమ వనరులను కొల్లగొడుతున్నారని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని పేదల సంక్షేమం లేదని ఇలాంటి పరిస్థితుల్లో మన ఓటును రాజ్యాంగ పరిరక్షణ కోసం సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్న తనను గెలిపించాలని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు చంద్రశేఖర్, హరి నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జాన్ ప్రసాద్, సిపిఐ నాయకులు సిగి చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకాంత్ పాల్గొన్నారు.










