Jan 29,2023 21:47

ప్రజా సంఘాల సదస్సులో మాట్లాడుతున్న ప్రభాకర్‌ రెడ్డి

కడప అర్బన్‌ : దేశ ప్రజల ఆస్తులను కార్పోరేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన 'చలో ఢిల్లీ సన్నాహక' సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆదానీ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని, రూ.10 లక్షల కోట్లు ఆవిరి అయిపోయిందని, 18 వేల కోట్ల ఎల్‌ఐసి దివాలా తీయించారని, ప్రజల సొమ్మును ఆదానికి దోచి పెట్టారని విమర్శించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై మో యలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్‌ సోర్స్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు వేతనాల పెంచలేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పోరాటం ద్వారా వచ్చిన 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లు మార్చి పెట్టుబడి దారు లకు అనుకూలంగా చేశారని విమర్శించారు. ఎనిమిది గంటల పనిని 12 గంటలకు చేశారని, సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా, పనిముట్లు ఎరువులు ధరలు పెంచారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశాన్ని కేంద్రంలో మతోన్మాద బిజెపి పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి మత రాజ్యాలుగా మార్చాలని ప్రయత్ని స్తున్నారని తెలిపారు. ఏ మతం జోక్యం లేకుండా లౌకిక దేశంగా ఉండాలని కోరారు. వామ పక్షాలు తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో నిధులు కోత విధిస్తున్నారని, ఉపాధి కూలి రూ.600 పెంచా లని, 200 రోజులు పని దినాలు కల్పించాలని, పట్టణాలకు విస్తరించాలని, కోరారు. విద్యుత్‌ సంస్థల ప్రయివేట్‌ పరం చేయటం, రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు పెంచి స్మార్ట్‌ మీటర్లు పెట్టడం, రైతులు, ప్రజల పైన భారాలు మోపడం కోసమని హెచ్చరిం చారు. కార్మిక, రైతు కూలీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5న నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్‌, జిల్లా ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్‌, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకష్ణయ్య, దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌, ఉపాధ్యక్షులు సురేష్‌, సిఐటియు జిల్లా నాయకులు పాపిరెడ్డి, సత్య నారాయణచారి, లక్ష్మీదేవి, భైరవ ప్రసాద్‌, వెంకట సుబ్బయ్య, చంద్రారెడ్డి, గోపి,వెంకటపతి, సాల్మన్‌, విజయకుమార్‌, చంటి, కేశవ, మహబూబ్‌ తార, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సునీల్‌ కుమార్‌, ఎం. ఆర్‌ .నాయక్‌, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని, శివకుమార్‌ పాల్గొన్నారు.